కోటిస్తేనే కనికరించారు!

30 Jul, 2019 02:49 IST|Sakshi
చికిత్స పొందుతున్న గజేందర్‌ , గజేందర్‌ కారు

ఫైనాన్షియర్‌ అపహరణ

చిక్కడపల్లిలో అర్ధరాత్రి హైడ్రామా 

సినిమా షూటింగ్‌ను తలపించేలా ఘటన 

రూ.3 కోట్ల డిమాండ్‌... కోటికి డీల్‌ 

డబ్బు తీసుకుని గజేందర్‌ను వదిలి పెట్టిన కిడ్నాపర్లు 

హైదరాబాద్‌: చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆటోమొబైల్‌ ఫైనాన్షియర్‌ కిడ్నాప్‌కు గురైన సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఫైనాన్షియర్‌ను కిడ్నాప్‌ చేసిన అగంతకులు రూ.కోటి తీసుకుని సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో వదిలిపెట్టారు. 3 గంటలపాటు నాటకీయ ఫక్కీలో ఈ ఘటన జరిగి చివరకు బాధితుడు స్వల్పగాయాలతో బయ టపడ్డారు. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకట్‌రెడ్డి వీడియాకు వివరాలు వెల్లడించారు. హిమాయత్‌నగర్‌ రోడ్‌ నం.16లో నివ సించే గజేందర్‌ పారక్‌ (40) మైనా ఫైనాన్స్‌ కంపెనీను నిర్వహిస్తున్నాడు. స్నేహితులను కలిసేందుకు తరచూ దోమలగూడ ఏవీ కళాశాల వద్దకు వస్తుంటాడు. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన కారు (టీఎస్‌09ఎఫ్‌ఏ2131)లో అక్కడికి వచ్చాడు. అతని స్నేహితుడు రసగుల్లా అతడితో మాట్లాడి వెళ్లిపోయాడు. 11.15 గంటల ప్రాంతంలో 30 నుంచి 35 యేళ్ల వయస్సున్న ఇద్దరు ద్విచక్ర వాహనంపై వచ్చి కారు వెనకే ఆపారు. వారు గజేందర్‌ను అడ్డగించేలోపే ముసుగు వేసుకున్న మరో ముగ్గురు కారులో అక్కడికి చేరుకున్నారు. వెంటనే గజేందర్‌ను కారులో కూర్చోబెట్టారు. ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా గజేందర్‌కు మాస్క్‌ తగిలించారు.  

రూ.3 కోట్లు డిమాండ్‌... 
గజేందర్‌ను అబిడ్స్‌కు తరలించి రూ.3 కోట్లు డిమాండ్‌ చేశారు. రూ.15 నుంచి రూ.20 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలేనని చెప్పినా కిడ్నాపర్లు ఒప్పుకోకపోగా, గజేందర్‌ను చితకబాదారు. దీంతో రూ.కోటి ఇవ్వడానికి డీల్‌ కుదిరింది. గజేందర్‌ అతని స్నేహితుడు రాజేష్‌ అగర్వాల్‌కు ఫోన్‌ చేసి రూ.కోటి తీసుకురావాలని కోరారు. జగదీశ్‌ మార్కెట్‌ వద్ద ఉన్న బాంబే జ్యూస్‌ సెంటర్‌ వద్దకు డబ్బులు తీసుకువచ్చి అతని కారు డిక్కీపైనే ఉంచి దూరంగా వెళ్లాలని కిడ్నాపర్లు సూచించారు. తర్వాత స్కూటీపై ముసుగువేసుకుని వచ్చిన ఇద్దరు ఆ బ్యాగ్‌ తీసుకుని చిరాగ్‌ ఆలీ లేన్‌ వైపు ఉడాయించారు. అనంతరం గజేందర్‌ను చిరాగ్‌ ఆలీ లేన్‌లో వదిలిపెట్టారు. బాధితుడు ఇంటికి వెళ్లి ఉదయం 5 గంటలకు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి, హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. సెంట్రల్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

ఆర్థిక లావాదేవీలే కారణమా?.. 
గజేందర్‌ కిడ్నాప్‌ కేసులో ఆర్థిక లావాదేవీలే ప్రధాన పాత్ర పోషించాయా అనే అనుమానంతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఫార్చూన్‌ ఫైనాన్స్‌లో దాదాపు రూ.24 కోట్ల మేర మోసం చేశాడనే కేసులో గజేందర్‌ అన్నను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి దానికి ఏదైనా సంబంధం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గజేందర్‌తో పాటు మరికొందరు బినామీలుగా ఏర్పడి ముంబైకి చెందిన కంపెనీని మోసగించిన కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, కిడ్నాప్‌ జరిగిన ప్రాంతంతో పాటు అబిడ్స్‌లో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలను కూడా పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా సేకరిస్తున్నారు.   

మరిన్ని వార్తలు