అర్ధరాత్రి మద్యం కొనుగోలు.. పోలీసులు ఏం చేస్తున్నట్టో.. 

12 Nov, 2018 13:27 IST|Sakshi
నగరంలో అర్ధరాత్రి ఓ వైన్స్‌ వద్ద మద్యం కొనుగోలు చేస్తున్న మందుబాబులు

అర్ధరాత్రి వరకు వైన్స్‌లు, హోటళ్ల నిర్వహణ నిబంధనలు పాటించని నిర్వాహకులు

గతి తప్పిన బందోబస్తు పట్టించుకోని ఉన్నతాధికారులు

సాక్షి, నిజామాబాద్‌అర్బన్‌: అసలే ఎన్నికల సమయం.. ఆపై ఈసారి ఎన్నికల కమిషన్‌ కఠిన నిబంధనలు అమలవుతున్నాయి.! పోలీసులు శాంతిభద్రతల నిర్వహణ పకడ్బందీగా వ్యవహరించాల్సి ఉంది. అయితే నిజామాబాద్‌ నగరంలో బందోబస్తు నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తరువాత యథేచ్ఛగా బార్లు, హోటళ్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మందుబాబులు రోడ్లపైనే తిరుగుతున్నారు. అత్యవసరం పేరిట, ప్రయాణం చేసి వచ్చే వారిపై వీరితో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణ సమయంలో అర్ధరాత్రి దాటాక మద్యం, బార్లు హోటళ్ల నిర్వహణ విఘాతం కలిగించే అవకాశం ఉంది. పోలీసులు బందోబస్తు పేరిట తనిఖీలు, పెట్రోలింగ్‌ చేస్తున్నా బార్లు, హోటళ్ల నిర్వహణ మాత్రం కొనసాగుతుండడం గమనార్హం.
 
బయట మూసి, లోపల తెరిచే.. 
నగరంలో అర్ధరాత్రి తరువాత సైతం మద్యం యథేచ్ఛగా దొరుకుతుంది. నాలుగు ప్రాంతాల్లో బార్ల నిర్వహణ అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగుతుంది. బార్‌లోనే మద్యం సేవించడమే కాకుండా బయటకు మద్యంను విక్రయిస్తున్నారు. మందుబాబులు రాత్రి సమయంలోనూ కొనుగోళ్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం బార్లు రాత్రి 11 గంటలలోపు మూసివేయాలి. అయితే ఇది అమలు కావడం లేదు. శని, ఆదివారాలు సైతం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు సైతం బార్‌ల నిర్వహణ కొనసాగుతోంది. బయట నుంచి ప్రవేశ మార్గాలు మూసివేయడం, లోపల నిర్వహణ కొనసాగిస్తున్నారు. పెద్దబజారు, లలితమహాల్‌ థియేటర్‌ సమీపంలో, వినాయక్‌నగర్‌ సమీపంలో ప్రజలకు అనేక అసౌకర్యం కలుగుతోంది. రోడ్లపైనే మద్యం తాగుతున్నారు. వచ్చి పోయే వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు.

పోలీసులు ఇటువైపు తనిఖీలు చేయకపోవడం గమనార్హం. అలాగే ఒక బార్‌ మాత్రం అర్ధరాత్రి వరకు నిర్వహణ కొనసాగుతుండగా ఉదయం 7.30 గంటలకే వెనుకవైపు నుంచి మద్యం విక్రయిస్తున్నారు. సమీపంలోనే వైన్స్‌ షాపు ఉండగా ఇక్కడ ఉదయం పూటనే మద్యం విక్రయాలు జరుగడం గమనార్హం. అర్ధరాత్రి వరకు బార్‌ల నిర్వహణ ఉండడంతో మందు బాబులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి సమయంలోనే రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దాడులు చోటుచేసుకుంటున్నాయి. మద్యం మత్తులో ఈ సంఘటనలు జరుగుతున్నాయి. నగరంలో గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.

బందోబస్తు ఏమవుతున్నట్టు... 
నగరంలో పోలీసుల బందోబస్తు రాత్రివేళలోనూ కొనసాగుతోంది. వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధి లో నాలుగు బీట్లు, మూడో, 4వ టౌన్‌ పరిధిలో నాలుగు బీట్లు పెట్రోలింగ్‌ కొనసాగుతోంది. బ్లూ కోట్స్‌ సిబ్బంది, పెట్రోలింగ్‌ వాహనాలు రాత్రివే ళలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇంతటి బం దోబస్తు నిర్వహిస్తున్న రాత్రివేళలో మాత్రం బారు లు, హోటళ్ల నిర్వహణ కొనసాగుతుండడంపై ప లు విమర్శలు తలెత్తుతున్నాయి. ఎన్నికల సమ యంలో పోలీసులు ఇలాంటివాటిపై చర్యలు తీసుకోకుంటే సమస్యలు ఉప్పతన్నమయ్యే అవకాశం ఉంది. గతంలో రాత్రివేళలో అనేక దాడులు, గొ డవలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అర్ధరాత్రి నిర్వహణపై పోలీసులు ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కఠిన చర్యలు తప్పవు... 
అర్ధరాత్రి వరకు హోటళ్లు, మద్యం దుకాణాలు నిర్వహణ కొనసాగవద్దు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైన నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. పోలీసు సిబ్బంది రాత్రివేళలో పెట్రోలింగ్‌ చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. ఇదివరకే పలు హోటళ్లపై కేసులు కూడా నమోదు చేశాం.
–శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ
 

మరిన్ని వార్తలు