కాగజ్‌నగర్‌లో వలస కార్మికుడి ఆత్మహత్య 

22 May, 2020 02:42 IST|Sakshi

లాక్‌డౌన్‌తో ఉపాధిలేమి.. ఆర్థిక ఇబ్బందులు 

కాగజ్‌నగర్‌టౌన్‌: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న వలస కార్మికుడు గురువారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌ వారణాసి జిల్లా సోలాపూర్‌ తాలూకా ధాన్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన వికాస్‌ చౌహాన్‌ (21), కొంతమంది అక్కడి యువకులతో కలిసి జనవరిలో గుజరాత్‌కు చెందిన అవినాష్‌ అనే కాంట్రాక్టర్‌ ఆధ్వర్యంలో స్థానిక సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో కాంట్రాక్టు కార్మికుడి (కూలి)గా చేరాడు.  కాంట్రాక్టు కార్మికులకు మిల్లు యాజమాన్యం స్థానిక ఓల్డ్‌ కాలనీలోగల కంపెనీకి సంబంధించిన డి టైప్‌ క్వార్టర్‌ కేటాయించింది. అందులో వికాస్‌తోపాటు ఐదు గురు కార్మికులు నివాసముంటున్నారు.

లాక్‌డౌన్‌ అమలుతో వీరంతా ఇక్కడే చిక్కుకున్నారు. మిల్లు యాజమాన్యం, కాంట్రాక్టర్‌ కార్మికులకు ఆహార సామగ్రి అందిస్తున్నా.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఉపాధి లేక  15 రోజులుగా వికాస్‌ చౌహాన్‌ సొంతూరుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేశాడు. శ్రామిక్‌ రైలు ద్వారా వారణాసి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన క్వార్టర్‌లోనే గురువారం ఉరేసుకున్నాడు. తోటి కార్మికుడు పోలీసులకు సమాచారం అందించారు. వికాస్‌ చౌహాన్‌ను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.  

వికాస్‌ చౌహాన్‌ మృతదేహం

మరిన్ని వార్తలు