ఎడారి దేశాల్లో వలసజీవి దిగాలు

19 Apr, 2020 01:54 IST|Sakshi
దుబాయ్‌లో చెట్ల కింద గడుపుతున్న తెలంగాణ కార్మికులకు ఆహార పదార్థాలు అందజేసిన గల్ఫ్‌ కార్మికుల అవగాహన వేదిక ప్రతినిధులు

లాక్‌డౌన్‌తో క్యాంపులకే పరిమితం.. కరోనా కల్లోలంతో ఆందోళన

భవిష్యత్తులో ఉపాధిపై బెంగ.. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వైనం 

సొంతూళ్లకు వచ్చేయాలనే తలంపులో కార్మికులు, ఉద్యోగులు

సాక్షి, నెట్‌వర్క్‌ : కరోనా సృష్టించిన కల్లోలంతో వలసజీవులు అల్లాడిపోతున్నారు. ఎడారి దేశాల్లో అందివచ్చిన అవకాశాలతో ఉపాధి పొందుతున్న వారి కలలు కల్లలయ్యాయి. భవిష్యత్తుపై ఆశలు తడారిపోతున్నాయి. గల్ఫ్‌ దేశాలన్నింటా లాక్‌డౌన్‌ అమలవుతోంది. పనుల్లేవు. వేతనాల్లేవు. కంపెనీలే ఇంత కడుపు నింపుతున్నాయి. కొన్ని కంపెనీలు.. లాక్‌డౌన్‌ కంటే ముందు నుంచే వేతనాలివ్వలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుంది?, ఉపాధి ఏమవుతుందోనని 20 రోజులుగా క్యాంపుల్లోనే ఉంటున్న కార్మికులు మానసిక వేదనకు గురవుతున్నారు.

అందరిదీ ఒకేమాట.. స్వదేశీ బాట
గల్ఫ్‌ దేశాల్లో మ్యాన్‌పవర్‌ను సరఫరా చేసే చిన్న కంపెనీలను యజమానులు ‘కరోనా’నెపంతో మూసివేస్తున్నారు. కార్మికుల వీసాలను రెన్యూవల్‌ చేయడం లేదు. ఈ నేపథ్యంలో కార్మికులు స్వదేశానికి వచ్చేయాలనే ఆలోచనతో ఉన్నారు. వీసా గడువున్న వారూ అదే యోచనతో ఉన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక మ్యాన్‌పవర్‌ కంపెనీలు కార్యకలాపాలను కొనసాగించినా కార్మికులు ఎక్కువ శాతం మంది అక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు. కరోనా మళ్లీ విజృంభిస్తుందేమోనని, స్వగ్రామంలో ఏదో ఒక పనిచేసుకోవడం మంచిదని భావిస్తున్నారు. పలువురు కార్మికులు స్వచ్ఛంద సంస్థలకు ఫోన్లుచేసి.. ‘విమానాలు ఎప్పటి నుంచి నడుస్తాయి?, అసలు మేం ఇండియాకు వెళ్తామా’ అని వాకబు చేస్తున్నారు.

పరిస్థితులు సర్దుకుంటాయని వారు కార్మికుల్లో మనోధైర్యం నింపుతున్నారు. ఇక, గల్ఫ్‌లో మన కార్మికులే కాక వివిధ ఆఫీసుల్లో, సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, ఆర్థికంగా స్థిరపడిన కాంట్రాక్టర్లు కూడా స్వస్థలాలకు వచ్చేయడానికే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటి వరకు సంపాదించుకున్నది చాలని, ఇక కుటుంబాలకు దగ్గర ఉండాలని అనుకుంటున్నారు. ఒమన్, ఖతార్, కువైట్, సౌదీఅరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌ దేశాల్లో తెలంగాణకు చెందిన వారు సుమారు 15లక్షల మంది ఉంటారని అంచనా. ఇందులో బ్లూకాలర్‌ (కార్మికులు) 13లక్షలు, వైట్‌కాలర్‌ (ఉద్యోగులు) 2లక్షల మంది వరకు ఉంటారని ప్రవాసిమిత్ర  లేబర్‌  యూనియన్‌ అధ్యక్షుడు  స్వదేశ్‌  పరికిపండ్ల  తెలిపారు. చదవండి: ఉద్యోగులను తొలగించొద్దు

ఖతార్‌లోని లేబర్‌ క్యాంపు వద్ద కార్మికులు
దుర్భరంగా ఖల్లివెల్లి కార్మికుల జీవనం
గల్ఫ్‌ దేశాలకు విజిట్‌వీసాలపై వెళ్లి గడువు ముగిసినా అక్కడే ఉండిపోవడం, కంపెనీ వీసాలపై వెళ్లి మరో కంపెనీలో చేరడం, రెసిడెన్సీ పర్మిట్‌ ముగిసినా రెన్యూవల్‌ చేసుకోకుండా ఉండిపోయిన వారిని ఖల్లివెల్లి కార్మికులుగా గుర్తిస్తారు. ప్రస్తుతం కంపెనీ క్యాంపుల్లో ఉన్న కార్మికులకు భోజన సదుపాయాలను కంపెనీల యాజమాన్యాలు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, ఖల్లివెల్లి కార్మికులకు చేయడానికి పనిలేకుండా పోయింది. దీంతో చేతిలో డబ్బులేక ఆకలితో అల్లాడుతున్నారు. ఇంటి అద్దె కట్టలేని పరిస్థితుల్లో కొందరు కార్మికులు అద్దె గదులను ఖాళీచేసి పార్కుల్లో తలదాచుకుంటున్నారు. దాతలందించిన ఆహార పదార్థాలతో కడుపు నింపుకుంటున్నారు. 

యూఏఈ: వేతనాల్లో కోత
ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న యూఏఈ కంపెనీలు.. కార్మికుల వేతనాల్లో కోతపెట్టాయి. వేతనాల రివిజన్‌కు ఆ దేశ ప్రభుత్వం కంపెనీల యాజమాన్యాలకు అనుమతినిచ్చింది. దీంతో కంపెనీలు 25 నుంచి 50 శాతం వరకు వేతనాల్లో కోత విధించాయి. కొన్ని కంపెనీలు ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే ఆరు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు. 

ఒమన్‌: ఉద్యోగాలకు దెబ్బ
కరోనా దెబ్బతో నష్టాలను మూటగట్టుకుంటున్న ఒమన్‌ కంపెనీల్లో విదేశీ కార్మికుల ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఇక్కడి తొమ్మిది గవర్నెన్స్‌లో ఒక మస్కట్‌లోనే లాక్‌డౌన్‌ అమలవుతోంది. మిగతాచోట్ల లాక్‌డౌన్‌ లేకున్నా.. కంపెనీలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. విదేశీ కార్మికులను తొలగించాలనే నిర్ణయం గతంలోనే జరిగింది. ఇప్పుడీ ప్రక్రియ ఊపందుకుంది.

ఖతార్‌: ఇంటిపని కార్మికుల ఇక్కట్లు
ఖతార్‌లో ఒక్క ప్రాంతంలోనే లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. కానీ, వైరస్‌ వ్యాప్తి భయంతో యజమానులు పనిలోకి రానివ్వకపోవడంతో లాక్‌డౌన్‌ లేని ప్రాంతాల్లో కూడా ఇంటిపని కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇటువంటి వారికి సహాయం అందించడానికి ఖతర్‌ ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ సేవలకు శ్రీకారం చుట్టింది. వారికి భోజన సదుపాయం కల్పిస్తోంది. మిగతా కంపెనీల్లోని కార్మికులకు యాజమాన్యాలే భోజన వసతి కల్పిస్తున్నాయి.

కువైట్‌: ‘సెలవుల వేతనం’కట్‌
కువైట్‌లోని కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఏడాది, రెండేళ్లకు ఒకసారి ఇచ్చే సెలవులకు సంబంధించి ప్రభుత్వం కొత్త ప్రతిపాదన చేసింది. గతంలో కార్మికులు సెలవుపై ఇంటికెళ్తే ఆ సెలవుల వేతనం చెల్లించేవారు. ఇప్పుడు కరోనా సంక్షోభంతో సెలవు రోజుల వేతనానికి కోతపెట్టింది. 

బహ్రెయిన్‌: ముందే వదిలించుకుంది!
పర్యాటక రంగంపై ఆధారపడిన బహ్రెయిన్‌.. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందే రెస్టారెంట్లు, బార్లు, పబ్‌ల్లో పనిచేసే విదేశీ కార్మికులను స్వస్థలాలకు పంపించింది. సెలవులపై ఇంటికి వచ్చిన కార్మికులు.. తమ వీసా గడువు పొడిగిస్తారా లేక రద్దుచేస్తారా తెలియక గందరగోళపడుతున్నారు.

సౌదీ: బతుకులు బందీ
సౌదీఅరేబియాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఇక్కడి విదేశీ కార్మికులు కరోనా సమాచారం, ఈ కారణంగా తలెత్తిన పరిస్థితుల గురించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంపై ఆంక్షలున్నాయి. దీంతో ఇక్కడ కార్మికులు తమ వెతలను చెప్పుకునే వీల్లేకుండాపోయింది.
భయంభయంగా రోజొక యుగంగా..
నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఆనందం గంగేశ్‌ కువైట్‌లో పదేళ్లుగా బల్దియా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో లేబర్‌ క్యాంపులో ఉంటున్నాడు. ఇక్కడ పరిస్థితులు బాగాలేకపోవడంతో ఇంటికి వెళ్లాలని ఉందని అంటున్నాడు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తరువాత ఇంటికి పంపిస్తారో లేదో తెలియడం లేదని, రోజూ ఓ యుగంలా గడుపుతున్నానని అంటున్నాడు. ఇంటిపై బెంగ పెట్టుకున్నాడు.
ఆశలు ఆవిరి..
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన గోపి గతేడాది ఖతార్‌ వెళ్లాడు. అతనికి కొన్ని రోజులు సరిగా పని దొరకలేదు. తినడానికి, రూమ్‌ అద్దెకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలంగాణ గల్ఫ్‌ సమితి సాయంతో రెండు నెలల క్రితం ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం దొరికింది. అంతలోనే కరోనా వైరస్‌ వ్యాప్తితో పనులన్నీ ఆపేశారు. నెల రోజులుగా గదిలోనే ఉంటూ బిక్కుబిక్కుమంటున్నాడు.
సంపాదించింది చాలనుకుంటున్నా..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన గడ్డం వెంకటరమణారెడ్డి 15ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటూ ఏసీకి సంబంధించిన ప్రముఖ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మంచి జీతమే.. అయితే, ప్రస్తుతం కరోనాతో నెలకొన్న పరిస్థితులతో ఆయన స్వదేశానికి రావాలనుకుంటున్నాడు. ఇప్పటి వరకు సంపాదించింది చాలని, కుటుంబసభ్యులతో ఉండాలనుకుంటున్నట్టు చెప్పాడు.
చూడాలని ఉంది..
మాది జగిత్యాల జిల్లా పోరుమళ్ల గ్రామం. ఖతార్‌లో 8ఏళ్లుగా భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నా. మార్చిలో నా కుమార్తె పెళ్లి. అదే నెల 25న నేను ఇండియాకు వెళ్లాల్సి ఉండె. కానీ, విమానాల్లేక ఆగిపోయాను. పెళ్లి వాయిదా పడింది. మళ్లీ విమానాలు ఎప్పుడు నడుస్తాయో?.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు