‘వలస’ వస్తున్న కరోనా..

20 May, 2020 11:47 IST|Sakshi

కరీంనగర్‌టౌన్‌: బతుకుదెరువు కోసం వలస వెళ్లిన కూలీలు తిరిగి వస్తుండగా... తిరుగు ప్రయాణంలో కరోనా వారితోపాటు ఇక్కడికి వలస వస్తోంది. కనిపించని మహమ్మారి వలస కార్మికులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కరీంనగర్‌ జిల్లాలో నిన్న మొన్నటి దాకా ఇండోనేషియన్లు, మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో కరోనా కరాళనృత్యం చేసి సద్దుమణుగగా, ఇప్పుడు ముంబయి కేసులు మళ్లీ హడలెత్తిస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముంబయి నుంచి స్వగ్రామాలకు వస్తున్న వలస కూలీలతో జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది.

మంగళవారం చొప్పదండికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 15న ముంబయి నుంచి వచ్చిన వలస కార్మికునికి జ్వరం, దగ్గు లక్షణాలు ఉండడంతో 17న ఆసుపత్రి ఐసోలేషన్‌లో చేర్చి రక్త నమూనాను గాంధీ ఆసుపత్రికి పంపించారు. మంగళవారం వచ్చిన రిపోర్టులో సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు రిపోర్టులో తేలింది. దీంతో వలస కార్మికుల హోం క్వారంటైన్‌పై వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిదిలోని జగిత్యాలలో ముంబయి నుంచి వచ్చిన వలస కార్మికుల్లో 10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కరీంనగర్‌ జిల్లాలో ముంబయి వలస కార్మికుల సంఖ్య తక్కువే అయినప్పటికీ వలస వెళ్లి వచ్చిన వ్యక్తుల్లో మొదటి పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ఆందోళన కలిగిస్తోంది.

అప్రమత్తమైన అధికార యంత్రాంగం...
వలస కార్మికునికి కరోనా పాజిటివ్‌ రావడంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముంబయి నుంచి వలస కార్మికులు వస్తున్న దృష్ట్యా అన్ని గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. కొత్తగా ఎవరైనా వస్తే వెంటనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా వలస కార్మికుల బాగోగులు తెలుసుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తోంది. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హోం క్వారంటైన్‌లపై దృష్టి...
వలస కార్మికులు స్వగ్రామం చేరుకోగానే వారికి క్వారంటైన్‌ ముద్ర వేసి హోం క్వారంటైన్‌ చేస్తున్నారు. వలస వెళ్లి వచ్చిన వారెవరూ ఇతరులను, కనీసం కుటుంబ సభ్యులను సైతం కలువకుండా ఉండే విధంగా చైతన్య పరుస్తున్నారు. కరోనా వైరస్‌ సోకితే వచ్చే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారిని ప్రతీ రోజు స్క్రీనింగ్‌చేస్తూ వారి ఆరోగ్య స్థితిని తెలుసుకుంటున్నారు. కరోనా లక్షణాలు కనిపించకపోతే క్వారంటైన్‌ పూర్తయ్యే వరకు కట్టడి చేసి ఆ తర్వాత వదిలేస్తున్నారు. ఇక లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త నమూనాలు సేకరిస్తున్నారు. ఇన్నాళ్లు కరోనా కట్టడిలో సఫలీకృతమైన జిల్లా యంత్రాంగానికి వలస కార్మికులు వస్తుండడంతో కరోనా నియంత్రణ సవాలుగా మారింది.

చొప్పదండిలో కలకలం
చొప్పదండి:చొప్పదండికి చెందిన ఓ వ్యక్తి ముంబయి నుంచి ఇటీవల ఇంటికి చేరుకోగా, జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో పరీక్షలు చేయించడంతో కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ కావడంతో స్థానికంగా కలకలం సృష్టించింది.పట్టణానికి చెందిన తొమ్మిది మంది, భూపాలపట్నంకు చెందిన ఇద్దరు ఇటీవల ముంబయి నుంచి స్వగ్రామాలకు చేరుకున్నారు. అధికారులు వారికి హోం క్వారంటైన్‌ చేశారు. అంగడిబజార్‌లో క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరాడు. కరోనా పరీక్షలకు పంపించగా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. దీంతో మంగళవారం రెవెన్యూ, పోలీస్‌ అధికారులు ముంబయి నుంచి వచ్చిన వారి వివరాలు, వారిని కాంటాక్ట్‌ చేసిన వ్యక్తుల వివరాలను సేకరించారు. ఎవరెవరు ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారో లెక్కలు వేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు