వలస బాట

10 Mar, 2018 09:59 IST|Sakshi
దుబాయిలో లేబర్‌క్యాంపులు

గల్ఫ్‌ దేశాలకు పల్లె జనం

నైపుణ్యం లేక         కూలి పనులకు పరిమితం

నిత్యం పది గంటల పని.. ఇరుకు గదుల్లో బస  

వలస కార్మికుల జీవనం దుర్భరం

సిరిసిల్ల :ఎడారి దేశంలో కాసుల ఆశలు పండించుకుందామని ఎంతో మంది గల్ఫ్‌ దేశాల బాటపడుతున్నారు. దుబాయి, మస్కట్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్‌లకు తెలంగాణ జిల్లాల నుంచి పొట్టచేతపట్టుకుని లక్షలాది మంది వలస వెళ్తున్నారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్తే చాలు.. సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే అభిప్రాయం ఉంది. కానీ అరబ్బు దేశాల్లో అంత ఈజీగా డబ్బులు సంపాదించడం సాధ్యంకాదు. ఏదైనా పనిలో నైపుణ్యం ఉంటే.. మెరుగైన వేతనాలు లభిస్తాయి. - వూరడి మల్లికార్జున్

ఇరుకు గదులు.. పనికి పరుగులు..
దుబాయిలోని లేబర్‌ క్యాంపుల్లో కార్మికులు ఇరుకు గదుల్లో ఉంటారు. ఒక్కో గదిలో ఆరు నుంచి పది మంది వరకు ఉంటారు. హాస్టళ్లలో ఉండే విధంగా మంచాలు ఉంటాయి. తెల్లవారుజామున ఐదింటికే లేచి వంట చేసుకుంటారు. ఉదయం 7 గంటలలోపే తిని పనిలోకి వెళ్లాలి. బస్సులో లేబర్‌ క్యాంపు నుంచి పని జరిగే ప్రాంతానికి వెళ్తారు. పది గంటల పాటు పని చేసిన తరువాత సాయంత్రం మళ్లీ లేబర్‌ క్యాంపునకు వస్తారు. బట్టలు ఉతుక్కుని, కూరగాయలు కోసుకుని తెల్లారి వంటకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇలా నిత్యం ఉరుకులు పరుగుల మధ్య వలస జీవితాలు సాగుతుంటాయి. మున్సిపల్‌ పరిధిలో పనిచేసే కార్మికులకు కొంత మెరుగైన సౌకర్యాలు ఉండగా.. ప్రైవేటు నిర్మాణ సంస్థలకు చెందిన క్యాంపులు ఇరుకుగదులు.. అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి.

పది గంటల పనికి 600 దిర్హమ్‌లు..
నాది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం మద్దికుంట. నాలుగేళ్ల కిందట దుబాయి వచ్చిన. వీసాకు, విమాన టిక్కెట్‌కు రూ.65 వేలు అయ్యాయి. అప్పులు చేసి వచ్చిన. దుబాయిలో బిల్డింగ్‌ పనిచేస్తాను. జబలాలీ లేబర్‌ క్యాంపులో ఉంటూ పనికి వెళ్తాను. రోజూ పది గంటలు పనిచేస్తే నెలకు 600 దిరమ్స్‌ ఇస్తారు. నెలకు 200 దిరమ్స్‌ ఖర్చులకు పోతాయి. ఇక మిగిలేవి 400 దిరమ్స్‌. ఇండియా రూపాయల్లో నెలకు రూ.7000 అవుతాయి. నాతో పాటు తెలంగాణకు చెందిన వారు 135 మంది ఉన్నారు. ఇంటికాడ మద్దికుంటలో మాకు వ్యవసాయం ఉన్నా.. నీరు లేదు.. నేను పెద్దగా చదువుకోలేదు. అక్కడ పనిలేక దుబాయికి వచ్చిన. నాలుగు ఏళ్లల్ల ఒక్కసారి చుట్టీపై (సెలవు) ఇంటికిపోయి వచ్చిన. ఇక్కడ చెప్పరాని బాధలున్నాయి. ఒక్కోసారి రాత్రిపూట ఏడుపు వస్తుంది. ఏం చేస్తాం.. చేతనైనంత కాలం పనిచేసి ఇంటికి పోవాలే.   – సంగం రామచంద్రం, మద్దికుంట

రెస్టారెంట్‌లో పనిచేస్తాను...
నాది సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్‌. నేను సిరిసిల్లలో ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్న. ఏడాది కిందట దుబాయి వచ్చాను. రెస్టారెంట్‌లో పనిచేస్తున్న. 10 గంటలు పనిచేస్తే నెలకు 1200 దిరమ్స్‌ ఇస్తారు. తిండి పెడతారు. ఖర్చులు పోను నెలకు ఇండియావి రూ.18000 మిగులుతున్నాయి. మా అమ్మ భాగ్య బీడీలు చుడుతుంది. నాన్న పర్శయ్య సుతారి పనిచేస్తాడు. నాకింకా పెళ్లి కాలేదు. అందరినీ విడిచిపెట్టి రావడం బాధగా ఉంది. ఇంటికాడ బాకీలు తీరిన తరువాత.. చెల్లెలు పెళ్లికి ఉంది. ఆమె పెళ్లి చేయాలి. ఏదైనా వ్యాపారం చేసుకునేందుకు నాలుగు డబ్బులు సంపాదించుకుని ఇంటికి రావాలని ఉంది. ఏదైనా పనివస్తే ఇక్కడ మంచి జీతాలు ఉన్నాయి.  కూలి పని చేసే వారికి తక్కువ డబ్బు వస్తుంది. పది గంటలు పనిచేయడం కష్టంగా ఉంది.    – జంగపల్లి శ్రీకాంత్‌

మరిన్ని వార్తలు