వలస కార్మికులకు కువైట్లో ఇబ్బందులు

22 Oct, 2016 02:46 IST|Sakshi
వలస కార్మికులకు కువైట్లో ఇబ్బందులు

వీసా, వర్క్ పర్మిట్ ఉన్నా.. కార్మికులకు తప్పని కష్టాలు
మన విదేశాంగ శాఖ చొరవ చూపాలని కోరుతున్న కార్మికులు

మోర్తాడ్: కువైట్‌లోని అరబ్బుల ఇళ్లలో పనికోసం వెళ్తున్న కార్మికులకు తనిఖీల పేరిట ఎయిర్‌పోర్టులో ఆ దేశ ఉన్నతాధికారులు చుక్కలు చూపిస్తున్నారు. మన దేశం నుంచి కువైట్‌కు వెళ్తున్న కార్మికులు ఎయిర్‌పోర్టు నుంచి బయటపడటానికి పడరాని పాట్లు పడుతున్నారు. వారికి ఇమిగ్రేషన్, వీసా, వర్క్‌పర్మిట్ అన్నీ సక్రమంగా ఉన్నా లేనిపోని అభ్యంతరాలు చెబుతూ గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. దీంతో కువైట్‌లోని వివిధ కంపెనీల్లో పని చేసే కార్మికులకు ఇమిగ్రేషన్ ప్రక్రియను తొందరగా ముగిస్తున్న అధికారులు.. కేవలం ఇంటి పని కోసం వెళ్తున్న వారిని గంటల తరబడి నిరీక్షించేలా చేస్తున్నారు.

కువైట్‌లోని అరబ్బుల ఇళ్లలో వంట పని, డ్రైవింగ్, గార్డెనింగ్ తదితర పనులు చేయడానికి తెలంగాణ జిల్లాల నుంచి అనేకమంది కార్మికులు వెళ్తున్నారు. ఇప్పటికే కొంతమంది అక్కడ పనిచేస్తుండగా మరికొందరు కార్మికులకు వీసా లభించడంతో కువైట్‌కు వెళ్తున్నారు. వీరిలో ఇంటిపని కోసం వెళ్లినవాళ్లనే ప్రత్యేకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పక్షం రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలానికి చెందిన రాములు కువైట్‌కు చేరుకోగా అతని వీసాను పరిశీలించిన అధికారులు ఇంటి పనికి సంబంధించిన వీసా ఉండటంతో దాదాపు 24 గంటలపాటు ఎయిర్‌పోర్టులో నిర్బం ధించారు.

రాములుతోపాటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన మరో 15 మంది కార్మికులను ఎయిర్‌పోర్టులోనే అధికారులు నిర్బంధించారు. చివరకు తమకు తెలిసిన వారి ద్వారా కువైట్‌లోని యజమానులకు సమాచారం అందిస్తే వారి చొరవతో ఎయిర్‌పోర్టు నుంచి బయటకు అధికారులు పంపించారు. ఇలా ఆరు నెలల నుంచి వలస కార్మికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని కువైట్‌లో సప్లయింగ్ కంపెనీ నిర్వహిస్తున్న ఏర్గట్ల వాసి అబ్బన్నోల్ల రాజేశ్వర్ ‘సాక్షి’కి వివరించారు. మన విదేశాంగశాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటేనే వలస కార్మికులకు ఎయిర్‌పోర్టులో కష్టాలు తప్పుతాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కువైట్ ప్రభుత్వంతో చర్చించి వలస కార్మికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు