సర్కారు సాయానికి ఎదురుచూపు

17 Feb, 2018 07:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సమీపిస్తున్న క్షమాభిక్ష గడువు 

కువైట్‌ ఖల్లివెల్లి కార్మికుల్లో ఆందోళన

ఆమ్నెస్టీ గడువు ముగిసిన తరువాత కఠిన శిక్షలు విధించే అవకాశం

(నిజామాబాద్‌ జిల్లా) :కువైట్‌లో అక్రమంగా ఉన్న వలస కార్మికులు తమ సొంత దేశాలకు వెళ్లిపోవడానికి కువైట్‌ ప్రభుత్వం ఆమ్నెస్టీ(క్షమాభిక్ష) అమలు చేస్తున్న విషయం విదితమే. అయితే క్షమాభిక్ష వల్ల ఔట్‌పాస్‌లు పొంది స్వదేశానికి వచ్చేవారిలో చాలా మంది విమాన చార్జీలు భరించే స్తోమత లేక రాష్ట్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కువైట్‌ నుంచి సొంత గ్రామాలకు వచ్చే కార్మికులకు విమాన చార్జీలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినా అక్కడ మాత్రం ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. ఫలితంగా కార్మికులు స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ద్వారా ఏర్పాట్లు చేస్తే ఎంతో మంది కార్మికులకు ఊరట లభిస్తుంది. కువైట్‌లో ఔట్‌పాస్‌ల కోసం ఈనెల 13 వరకు దరఖాస్తు చేసుకున్న కార్మికుల సంఖ్య సుమారు 15వేల వరకు ఉంది.

ఇందులో పది వేల మంది కార్మికులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు  క్రిమినల్‌ కేసులు లేని వారిని గుర్తించి ఇప్పటి వరకు సుమారు 9వేల మందికి ఔట్‌పాస్‌లు జారీ చేశారు. ఇప్పటికి 2వేల మంది తెలుగు రాష్ట్రాల కార్మికులు సొంత ఊర్లకు చేరుకున్నారు. వీరిలో ఎక్కువ మంది టిక్కెట్‌ల కోసం స్నేహితులు, బంధువుల వద్ద అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిలో కొందరికి మాత్రం ఆ రాష్ట్రానికి చెందిన స్వచ్ఛంద సంస్థలు టిక్కెట్‌లను కొనుగోలు చేసి ఇచ్చాయి. మన రాష్ట్రానికి చెందిన కార్మికుల కోసం ఎన్‌ఆర్‌ఐ సెల్‌ పనిచేస్తుందని ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదని కార్మికులు చెబుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.4 కోట్లు కేటాయించినట్లు ప్రకటించినా ఏ ఒక్కరికి కూడా టిక్కెట్‌ సహాయం అందలేదని కువైట్‌లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. - ఎన్‌. చంద్రశేఖర్, మోర్తాడ్‌

అమలుకాని కార్మిక సంస్కరణలు...
కువైట్‌లో పనిచేసే విదేశీ కార్మికులు వంచ నకు గురికాకుండా అక్కడి ప్రభుత్వం 2016 జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త సంస్కర ణలు చేపట్టి మార్గదర్శకాలు జారీచేసింది. కంపెనీల్లో ఓవర్‌టైం చేస్తే అందుకు తగ్గ వేతనం ఇవ్వడంతో పాటు, ప్రతి రెండేళ్లకు ఒకసారి రెండు నెలల సెలవు ఇచ్చి ఇంటికి వెళ్లి రావడానికి కార్మికుడికి కంపెనీ టిక్కెట్‌ను భరించాలి. అయితే, ఆ సంస్కరణల అమలు కావడం లేదు. ఇందుకు నిదర్శనం ఖరాఫీ ఇంటర్నెషనల్‌ కంపెనీ కార్మికులు వేతనాలు, విమాన టిక్కెట్‌ల గురించి కంపెనీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు వ్యక్తం చేయడమే. ఒక్క ఖరాఫీ  కంపెనీయే కాకుండా ఎన్నో కంపెనీలు కార్మికుల సంక్షేమానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన కంపెనీల యాజమాన్యాలపై కువైట్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఖల్లివెల్లీ కార్మికుల సంఖ్య అక్కడ పెరిగిపోయింది.

గ్రాట్యూటీ ముంచుతున్న కంపెనీలు...
కువైట్‌లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులకు నిబంధనల ప్రకారం   గ్రాట్యూటీ ఇవ్వాల్సి ఉంది. పదేళ్ల సీనియార్టీ ఉన్న కార్మికులకు మూల వేతనం ఆధారంగా మన కరెన్సీలో రూ.1లక్ష నుంచి రూ.2లక్షల వరకు గ్రాట్యూటీ లభిస్తుంది. గ్రాట్యూటీ చేతికి వస్తే సొంత దేశానికి వెళ్లి ఏదో ఒక ఉపాధి పొందవచ్చని భావించిన కార్మికులను కంపెనీలు వంచించాయి. కువైట్‌లో అనేక కంపెనీలు  గ్రాట్యూటీ విషయంలో మొండికేస్తున్నాయి.

తప్పనిసరిగా ఖల్లివెల్లి అయ్యాను..
నాపేరు రమేష్‌. మాది జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం చింతకుంట. నేను కువైట్‌కు కంపెనీ వీసాపైనే మూడేళ్ల కింద వెళ్లాను. ఓవర్‌ టైం పనిచేసినా కంపెనీ వారు మాత్రం నాకు తక్కువే వేతనం ఇచ్చారు. ఖల్లివెల్లీ అయినవారికి ఓటీ చేస్తే ఎక్కువ వేతనం వచ్చేది. రెండేళ్లు కంపెనీలో పనిచేసి ఏడాది కింద బయటకు వచ్చాను. ఖల్లివెల్లి (కంపెనీ నుంచి వచ్చి బయట పనిచేయడం) అయిన తరువాతనే ఎక్కువ వేతనం లభించింది. అక్కడి అధికారులకు పట్టుబడి పదిహేను రోజులు జైలు శిక్ష అనుభవించి  వచ్చాను. కువైట్‌లో పరిస్థితి బాగా లేదు. మన ప్రభుత్వం ఆదుకోవాలి.

తప్పుడు కేసు పెట్టడంతో ఇంటికి వస్తానో రానో..
నాపేరు మహిపాల్‌. మాది నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం నాగేపూర్‌. నేను ఆరేళ్ల కింద కువైట్‌కు వచ్చాను. కంపెనీ యజమాని ఒప్పందం ప్రకారం వేతనం ఇవ్వకపోవడంతో ఖల్లివెల్లి అయ్యాను. అయితే నాపై యజమాని తప్పుడు కేసు పెట్టాడు. క్షమాభిక్ష అమలులో ఉన్నా.. కేసు వల్ల నేను ఇంటికి వస్తానో రానో అని అనుమానంగా ఉంది. ఇప్పుడు ఇంటికి రావాలంటే మన విదేశాంగ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని నన్ను ఇంటికి చేర్చాలి.

కువైట్‌లో ఎలాంటి ఏర్పాట్లూ లేవు
నాపేరు భీంరాజ్‌. మాది జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం చింతకుంట. నేను బదర్‌ ఆల్‌ ముల్లా కంపెనీలో పనిచేయడానికి కువైట్‌ వెళ్లాను. అక్కడ పని బాగా లేకపోతే ఖల్లివెల్లి అయ్యాను. ఔట్‌ పెట్టడంతో మొదట సొంతంగా టికెట్‌ కొనుక్కొని ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. మొబైల్‌ కంపెనీకి బకాయి ఉన్నట్లు చూపడంతో ఇంటి నుంచి రూ.70 వేలు తెప్పించుకుని రెండోసారి టికెట్‌ కొనుక్కొని ఇంటికి వచ్చాను. కువైట్‌లో ఖల్లివెల్లి కార్మికుల కోసం ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. మా స్నేహితుడి సహకారంతోనే ఇంటికి వచ్చాను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా ఉపాధి చూపాలి.

మరిన్ని వార్తలు