రైలెందుకు రాకపాయె..!

8 May, 2020 11:55 IST|Sakshi
డీసీఎం వ్యాన్లలో స్వరాష్ట్రాలకు వెళ్తున్న కార్మికులు

నాలుగురోజులుగా నిరీక్షించినా ఫలితం శూన్యం

రైలు రాకపోవడంపై వలస కార్మికుల్లో చర్చ

రోడ్డు మార్గం ద్వారా తరలింపు ప్రక్రియ ప్రారంభం

జ్యోతినగర్‌(రామగుండం): వలసకార్మికులు స్వరాష్టాలకు వెళ్లేందుకు రావాల్సిన రైలు బండికి రెడ్‌సిగ్నల్‌ పడటంతో రామగుండం చేరుకోలేక పోయింది. రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ విద్యుత్‌ ప్రాజెక్టుతో పాటు రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మాణంలో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కార్మికులు లేబర్‌ క్యాంపుల్లో ఉంటూ విధులు నిర్వహించారు. లాక్‌డౌన్‌తో పనులుకు బ్రేక్‌ పడగా 45 రోజులుగా వారు లేబర్‌ క్యాంపుల్లో ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌లో సడలించిన నిబంధనల మేరకు వలస కార్మికులు వారి స్వరాష్ట్రాలకు వెళ్లవచ్చని ఉత్తర్వులు విడుదల చేసిన క్రమంలో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తయారయ్యారు.

వివరాలు నమోదు..
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని వలస కార్మికుల పూర్తి వివరాలను రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు సేకరించారు. జాబితా ప్రకారం ఏ రాష్ట్రానికి చెందినవారు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని కూడా లెక్క కట్టారు. ఈ నెల 2వ తేదీన కార్మికులు సంబంధిత పోలీస్‌స్టేషన్లలో ఆధార్‌ కార్డును జత చేసి వివరాలను అందించడం ప్రారంభించారు. 3న ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్‌లో పెద్ద ఎత్తున కార్మికులు తమ వివరాలు పోలీసులకు అందించేందుకు వచ్చారు. అక్కడ జరిగిన సంఘటనపై పోలీసులు లాఠీచార్జ్‌ సైతం చేశారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్‌ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్‌ అభిశేక్‌రావులు సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికులను శాంతింపజేశారు.

4న మేడిపల్లి సెంటర్‌ లేబర్‌ క్యాంపు వద్ద కార్మికులు తమ స్వస్థలాలకు వెళతామని నిరసన చేపట్టగా డీసీపీ రవీందర్, ఏసీపీ ఉమేందర్‌లు వారి ప్రాంతాలకు పంపిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేయడంతో పాటు వారికి ఆయా కాంట్రాక్టర్లు ఇవ్వాల్సిన వేతనాల అంశంపై మాట్లాడారు. 5న మేడిపల్లి లేబర్‌ క్యాంపు ఎదుట పోలీసు అధికారులు జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన వారిని రైలుమార్గం ద్వారా పంపించేందుకు వివరాలను నమోదు చేసి 600 మందికిపైగా టోకన్లు జారీ చేశారు. 6న వారిని పంపించకపోవడంతో రోడ్డు మార్గాన రైల్వేస్టేషన్‌ బాట పట్టారు. పెద్ద ఎత్తున కార్మికులు రోడ్డుపై వెళ్లడంతో సీపీ సత్యనారాయణ వారికి నచ్చజెప్పడంతో శాంతించారు. 4 రోజులుగా వరుస సంఘటనలు జరుగుతున్నా కార్మికులను స్వస్థలాలకు పంపే మార్గం సుగమం కాలేదు. ఈక్రమంలో సొంత డబ్బులతో స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు కార్మికులు సిద్ధం కాగా 50 వాహనాలకు పాస్‌లు జారీ చేశారు. వాహనాల వివరాలతో పాటు ఎంత మంది వెళుతున్నారనే విషయాలను పోలీసులు నమోదు చేసుకుని పాస్‌లను జారీ చేశారు.

రైలు రాకపోవడంపై అసహనం..
స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా వివరాలను అందించినా తమను తీసుకెళ్లేందుకు రైలు రాకపోవడంతో కార్మికులు అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి రైలు ద్వారా వలస కార్మికులను తరలిస్తుండగా రామగుండం ప్రాంతానికి చెందిన కార్మికులను తరలించడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని వారు చర్చించుకుంటున్నారు. కార్మికులందరూ వెళ్లిపోతే ఇక్కడ పనులు నిలిచిపోతాయనే అనుమానంతో రైలు రాకకు రెడ్‌ సిగ్నల్‌ వేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు