మెక్కిన బియ్యం..కక్కిస్తారా?

23 Sep, 2014 02:43 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గడువు సమీపిస్తున్నా కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని (సీఎంఆర్) సరఫరా చేయడంలో మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో సేకరించిన  ధాన్యాన్ని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మిల్లర్ల నుంచి సీఎంఆర్‌ను కక్కించాల్సిన పౌరసరఫరాల శాఖ వ్యవహారమే ప్రస్తుత పరిస్థితికి కారణమనే విమర్శలు వస్తున్నాయి.

గడువులోగా స్పందించని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు ఎంతమేర ఫలితాన్నిస్తాయో చూడాల్సిందే. ఈ ఏడాది మార్చిలో రైతులు పండించిన వరి దాన్యాన్ని ఐకేపీ ఆధ్వర్యంలోని మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగోలు చేశారు. పౌర సరఫరాల శాఖ వద్ద కొనుగోలుకు తగినంత సిబ్బంది లేరనే సాకుతో ధాన్యం సేకరణ బాధ్యత ఐకేపీ సంఘాలకు అప్పగించారు. ఇలా సేకరించిన 61,308.439 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని జిల్లాలోని 44 రైస్‌మిల్లులకు సరఫరా చేశారు.

 ఇలా స్వీకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి మిల్లర్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. స్వీకరించిన ధాన్యంలో 68శాతం అంటే 41,689.738 మెట్రిక్ టన్నులు ప్రభుత్వానికి సెప్టెంబర్ 30వ తేదీలోగా సరఫరా చేయాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు మొదలుకుని కస్టమ్ మిల్లింగ్ వ్యవహారాన్ని పౌర సరఫరాల శాఖ పర్యవేక్షించాలి. అయితే పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కేవలం 31.35 శాతం అంటే 19,225.015 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే పౌరసరఫరాల శాఖ గోదాములకు చేరింది.

గడువులోగా బియ్యాన్ని సరఫరా చేయాలంటూ ఎన్నిమార్లు తాఖీదులు పంపినా, సమీక్ష నిర్వహించినా మిల్లర్లు స్పందించడం లేదు. పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా సమీక్షలు మినహా మిగతా సందర్భాల్లో కనీసం సీఎంఆర్ పురోగతిపై సమాచారం పంచుకునేందుకు కూడా సుముఖత చూపడం లేదు. నెలాఖరులోగా సీఎంఆర్ పూర్తి చేయాలని పౌర సరఫరాల అధికారులు మిల్లర్లకు తెగేసి చెప్పినా ఫలితం కనిపించడం లేదు. విషయం కాస్తా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో గడువులోగా స్పందించని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

 పక్కదారి పట్టిన సీఎంఆర్
 ఐకేపీ సంఘాల ద్వారా సరఫరా అయిన ధాన్యాన్ని మిల్లర్లు బియ్యంగా మార్చి ఇప్పటికే బహిరంగ మార్కెట్‌కు తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు ఎక్కువగా ఉండటంతో గోదాములకు తరలాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వ సొమ్ముతో సేకరించిన ధాన్యం మిల్లర్ల జేబులు నింపేందుకు ఉపయోగపడుతోందనే విమర్శలున్నాయి. బియ్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లు కోటాను పూర్తి చేసేందుకు ఇతర మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న బియ్యాన్ని పక్కదారి పట్టించి కొందరు మిల్లర్లకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. రీ సైక్లింగ్ పద్ధతిలో పీడీఎస్ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వ గోదాములకు చేర్చేందుకు సన్నాహలు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో జిల్లాకు చెందిన పీడీఎస్ బియ్యాన్ని మెదక్ జిల్లా నాగులపల్లి రైల్వే యార్డు కేంద్రంగా ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. స్టాక్ పాయింట్లలో బియ్యం నిల్వల లెక్కల్లోనూ గతంలోనూ తేడాలు వచ్చాయి. మిల్లర్లు మాత్రం ఆరోపణలు తోసిపుచ్చుతూ ఇతర అంశాలను సాకుగా చూపుతున్నారు.

కరెంటు కోతలు, గోదాముల కొరత వల్లే సకాలంలో ఇవ్వలేకపోతున్నామంటూ బదులిస్తున్నారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లకు పర్మిట్ల జారీలో పౌర సరఫరాల శాఖ తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు ఎన్ని వస్తున్నా అధికారులు మాత్రం మిల్లర్లపై ఎక్కడా కేసులు నమోదు చేసిన జాడ కనిపించడం లేదు. గడువులోగా సీఎంఆర్ సరఫరా చేయని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ ఎంత మేర కొరడా ఝళిపిస్తుందో చూడాల్సిందే.

మరిన్ని వార్తలు