మిమిక్రీ కళాకారుడు హరికిషన్‌ హఠాన్మరణం

24 May, 2020 03:29 IST|Sakshi

గుండెపోటుతో కన్నుమూత

12 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హరికిషన్‌

గౌతంనగర్‌ (హైదరాబాద్‌): అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు హరికిషన్‌(58) గుండెపోటుతో శనివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సుధ ఏఎస్‌రావునగర్‌లోని కాల్‌ పబ్లిక్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు శశాంక్‌ ఆస్ట్రేలియాలో, చిన్న కుమారుడు గుజరాత్‌లో ఉంటున్నారు. పన్నెండేళ్లుగా హరికిషన్‌కు కిడ్నీలు చెడిపోవడంతో అప్పటి నుంచి రెండ్రోజులకొకసారి డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. పదేళ్ల క్రితం భార్య సుధ ఒక కిడ్నీ ఇచ్చినప్పటికీ అది కూడా చెడిపోయింది.

జాతీయ, అంతర్జాతీయయంగా ఎన్నో ప్రదర్శనలు చేసి హరికిషన్‌ అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. కుమారులు విదేశాల్లో ఉండటంతో వారు రావడానికి రెండ్రోజులు పడుతుందని, అప్పటి వరకు హరికిషన్‌ భౌతికకాయాన్ని లాలాగూడ మెట్టుగూడలోని రైల్వే ఆస్పత్రిలో భద్రపరిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరికిషన్‌ అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని తెలిపారు. అందరితో ఆప్యాయంగా ఉండే హరికిషన్‌ మృతి చెందడంతో మల్కాజిగిరిలోని సాయిపురి కాలనీలో ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. 

మరిన్ని వార్తలు