టైరు పేలి మినీవ్యాన్‌ బోల్తా

1 Apr, 2018 04:18 IST|Sakshi
వాజేడు మండలం మండపాక సమీపంలో బోల్తా పడిన వ్యాన్‌. ఘటనా స్థలంలో క్షతగాత్రులు

ఇద్దరు కూలీల మృతి.. 43 మందికి గాయాలు 

వాజేడు/ఏటూరునాగారం: సామర్థ్యానికి మించి కూలీలతో వెళ్తున్న మినీవ్యాన్‌ టైరు పేలి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో 43 మంది గాయపడ్డారు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం మండపాక వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగింది. ఏటూరునాగారం మండలం శివాపురం గ్రామానికి చెందిన 50 మంది కూలీలు వాజేడు మండలం పెద్దగొల్లగూడెంలోని ఓ రైతు పొలంలో మిర్చి ఏరేందుకు తెల్లవారుజామున మినీ వ్యాన్‌లో బయల్దేరారు. ఈ క్రమంలో వాజేడు మండలం మండపాక గ్రామం దాటగానే వాహనం ముందు టైరు పంక్చర్‌ అయి అదుపు తప్పింది.

డ్రైవర్‌ వాహనాన్ని అదుపు చేసేందుకు విఫలయత్నం చేయగా.. చివరకు హ్యాండ్‌ బ్రేక్‌ను ఉపయోగించాడు. దీంతో ఒక్కసారిగా వాహనం నిలిచిపోవడంతో అదుపుతప్పి బోల్తాపడింది. కూలీలు జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. మండపాక గ్రామస్తులు క్షతగాత్రులను ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూనెం చంద్రమ్మ (50) ఘటన స్థలంలోనే మృతిచెందగా, చికిత్స పొందుతూ ఐలయ్య(40) తుదిశ్వాస విడిచాడు. తీవ్రంగా గాయపడిన 20 మందిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి, మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. మిగతా 23 మంది ఏటూరునాగారం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రులంతా ఒకే గ్రామానికి చెందిన ఆదివాసీలు కావడంతో వారి స్వగ్రామం శివాపురంతోపాటు ఇతర ఆదివాసీగూడెల్లో విషాదం అలుముకుంది. క్షతగాత్రులను చూసి కుటుంబ సభ్యులు కన్నీళ్లపర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు