‘వెలుగు’లో  కష్టాలు

9 Sep, 2018 11:21 IST|Sakshi
నగరంలోని సీతారాంనగర్‌ కాలనీలో కంటివెలుగు శిబిరం

నిజామాబాద్‌అర్బన్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. వైద్య శిబిరాల నిర్వహణ సమయంలో భోజన వసతి కల్పించాల్సి ఉండగా చాలా చోట్ల పట్టించుకోవడం లేదు. భోజన ఏర్పాట్లకు నిధులు కూడా మంజూరు అయ్యాయి. గతనెల 15న జిల్లా వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో కంటి వెలుగు వైద్యశిబిరాలు ప్రారంభమయ్యా యి. 35 వైద్య బృందాలను ఏర్పాటు చేశా రు. ఇందులో జనరల్‌ వైద్యులతో పాటు కంటి వైద్య నిపుణులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఇద్దరు, స్థానిక ఏఎన్‌ఎంలు ఇద్ద రు, ఆశకార్యకర్తలు , ఇద్దరు సూపర్‌వైజ ర్లు ఉంటారు. వీరికి మధ్యాహ్న వేళలో భోజనం, రెండు పూటల టీ , శిబిరం వద్ద టెంట్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. ఒక్కో శిబిరానికి మొదట రూ. 1500 మంజూరు చేయగా సరిపోవడంలేదని రూ. 2,500 పెంచారు. కంటి వెలుగు శిబిరం నిర్వహణకు జిల్లాకు ఒక రూ. కోటి 9 లక్షలు మంజూరు అయ్యాయి.

ఇందులో నుంచి ఖర్చుకు కేటాయిస్తున్నారు. అయితే కంటి వెలుగు శిబిరాల్లో వైద్యసిబ్బందికి భోజనాలు అందించకుండా, ఇంటి నుంచే తెచ్చుకోవాలని వైద్యాధికారులు సూచించడం గమనార్హం. కనీసం రెండు పూటల టీ అందించడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని నాలుగు వైద్యశిబిరాల్లో భోజనాన్ని స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేయిస్తున్నారు. కేటాయించిన నిధులను మాత్రం ఖర్చు చేయడం లేదు. మరోవైపు వైద్యశిబిరాలను మహిళ సంఘాలు, కుల సంఘాలు, కమ్యూనిటీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. టెంట్‌ ఖర్చు కూడా మిగిలిపోతోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి.

దీంతో శిబిరంలో పాల్గొనే సిబ్బంది భోజన వసతి కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పీహెచ్‌సీ వైద్యసిబ్బంది జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 50 రోజుల వరకు శిబిరాల నిర్వహణ సమయంలో భోజన వసతి కోసం నిధులు ముందుగానే ప్రభుత్వం మంజూరు చేసింది. స్థానికంగా మెడికల్‌ ఆఫీసర్లు డబ్బులు ఖర్చు చేయకపోవడంపై అధికారులు మండిపడుతున్నారు. గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీలు , ప్రజాప్రతినిధుల ద్వారా భోజన వసతి కల్పిస్తున్నారే తప్ప వైద్యాధికారులు నిధులు ఖర్చు చేయడం లేదు. ఇప్పటికే దాదాపు 70 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యశిబిరాలకు ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో వైద్యసిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

నిధులు మంజూరు అయ్యాయి : జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి డా సుదర్శనం 
కంటి వెలుగు నిర్వహణకు సంబంధించి సంబంధిత సెంటర్లకు నిధులు ముందస్తుగానే విడుదల అయ్యాయి. సిబ్బందికి భోజన, ఇతర ఖర్చులకు ఎలాంటి లోటు లేకుండా నిధులు అందుబాటులో ఉన్నాయి. ఎవరైన భోజన వసతి కల్పించకుంటే చర్యలు తీసుకుంటాం. మంజూరు అయిన నిధుల ప్రకారం తప్పకుండా కనీస సౌకర్యాలు, భోజన వసతి వైద్యాధికారులు కల్పిలంచాలి.

>
మరిన్ని వార్తలు