ఎక్సైజ్ కానిస్టేబుల్: కనీస విద్యార్హత ఇంటర్

9 Feb, 2016 04:33 IST|Sakshi
ఎక్సైజ్ కానిస్టేబుల్: కనీస విద్యార్హత ఇంటర్

సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత కనీస విద్యార్హతగా ప్రభుత్వం మార్పులు చేసింది. పోలీస్‌శాఖలోని కానిస్టేబుల్ పోస్టుల కనీస విద్యార్హతను ఉమ్మడి రాష్ట్రంలోనే ఎస్‌ఎస్‌సీ నుంచి ఇంటర్‌కు పెంచారు. కానీ ఎక్సైజ్ శాఖలో మాత్రం కానిస్టేబుళ్ల నియామకానికి ఎస్‌ఎస్‌సీనే అర్హతగా కొనసాగుతూ వచ్చింది. దీంతో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల జీతభత్యాలు మొదలు పీఆర్‌సీ వరకు పోలీస్ కానిస్టేబుళ్ల కన్నా తక్కువగా ఉంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఇంటర్మీడియట్  లేదా తత్సమాన పరీక్ష’ పాసైనవారే ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఉద్యోగానికి అర్హులని పేర్కొంటూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ మేరకు ఏపీ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1998ను తెలంగాణకు అన్వయించుకొని మార్పులు చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా (రెవెన్యూ) ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్ల విద్యార్హతను మార్చిన నేపథ్యంలో కొత్త నియామకాలకు సర్కార్ పచ్చజెండా ఊపినట్టేనని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. 1,000కి పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్  ఆర్‌వీ చంద్రవదన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు