‘నర్సిరీలో పనిచేసే వారికి పీఎఫ్‌, ఈఎఫ్‌ అందిస్తాం’

17 Jun, 2020 12:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది 6వ విడత హరితహార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఇందుకోసం మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్‌) శంషాబాద్‌లోని హెచ్‌ఎండీఏ నర్సిరీ మొక్కలను బుధవారం పరీశీలించారు. ఈ సందర్భంగా నర్సరీలో మొక్కలను పెంచుతున్న తీరు, ఏఏ మొక్కలు అందుబాటులో ఉన్నాయనే వివరాలపై ఆయన ఆరా తీశారు. ఇక ఈ మొక్కలను ప్రజలకు అందించే ప్రక్రియ వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా నర్సరీలో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. (హామీలపై కేటీఆర్‌ సమాధానం చెప్పాలి)

అక్కడ పనిచేసే అర్హులైన వారందరికీ ఈఎఫ్, పీఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది 6వ విడత హరితహార కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడతామని చెప్పారు. పట్టణాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచడంపై ఇప్పటికే తమ శాఖ తరపున ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామన్నారు. హరితహారంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన భవిష్యత్ తరాలకి గ్రీనరీని కానుకగా ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ పరిధిలో ఎవరికైనా మొక్కల కావాల్సి వస్తే నగర పరిధిలో ఉన్న నర్సరీలలో నుంచి ఉచితంగా  తీసుకోవచ్చని,  ఒకటి రెండు రోజుల్లో నగరంలోని నర్సరీల సమగ్ర సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు. (హరిత పట్నం కావాలి: కేటీఆర్‌)

మరిన్ని వార్తలు