అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు

10 Oct, 2019 01:33 IST|Sakshi

పాస్‌లు కచ్చితంగా అనుమతించాలి

ప్రతి బస్సులో టికెట్‌ ధరల పట్టిక

అధికారుల సమీక్షలో మంత్రి పువ్వాడ 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం చాలినన్ని బస్సులు తిరుగుతున్నాయని, ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో చార్జీలపై దృష్టి పెడుతున్నామని ఆయన వెల్లడించారు. టికెట్‌ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్మికుల సమ్మె, రవాణా శాఖ తీసుకున్న చర్యలు, పండుగకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మతో కలిసి ఆర్టీసీ అధికారులు, ఈడీలు, రీజినల్, డివిజనల్‌ మేనేజర్లు, ఆర్టీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దాదాపు నాలుగు గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రయాణీకుల రద్దీకి సరిపడా బస్సులు నడుపుతున్నామని, కొన్ని చోట్ల టికెట్‌ ధర కంటే ఎక్కువ మొత్తం తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. టికెట్‌ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అధిక వసూళ్లు నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి బస్సులో ఆయా రూట్లలో ఉండే చార్జీల పట్టికను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికోసం ప్రతి డిపోలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పోలీస్‌ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇన్‌చార్జీగా నియమిస్తున్నట్లు తెలిపారు.

బస్సుల్లో డ్రైవర్‌ సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్‌ రూమ్‌ నంబర్లను ప్రదర్శిస్తామని, టికెట్‌ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 14 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కానుండటంతో షెడ్యూల్‌ ప్రకారం బస్సులను నడుపుతామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు ఎలాంటి టూర్‌ షెడ్యూల్‌ ఉండేదో అదే షెడ్యూల్‌ను దాదాపు శుక్రవారం నుంచి అమలు చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి వెళ్లాల్సిన బస్సులను నడుపుతామని, ఆర్టీసీ బస్సుల్లో బస్‌పాస్‌లను యథావిధిగా అనుమతించాలని ఆదేశించారు. విద్యార్థులు, వికలాంగులు, పాత్రికేయులు, ఉద్యోగులతో పాటు బస్‌ పాసులన్నీ అనుమతించాలని, దీనిపై ఎలాంటి ఫిర్యాదులు రావద్దని మంత్రి స్పష్టం చేశారు. నాలుగు రోజులుగా ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులతో పాటు వివిధ వాహనాలను తిప్పి, ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చామని, ఇదే రీతిన తిరుగు ప్రయాణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రత్యేక సర్వీసుల సేవలన్నీ వినియోగించుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశంతో ఆయా శాఖల అధికారులు సంయుక్తంగా ప్రజా రవాణా స్థితిగతులన్నీ పరిశీలిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

రద్దీని బట్టి మరిన్ని బస్సులు.. 
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 5,049 బస్సులు తిప్పామని మంత్రి అజయ్‌ వెల్లడించారు. ఇందులో ఆర్టీసీ బస్సులు 3,116, ఆర్టీసీ అద్దె బస్సులు 1,933తో పాటు ప్రైవేట్‌ వాహనాలు తిరిగాయని చెప్పారు. ఈ రెండు రోజులు ప్రయాణీకుల రద్దీని బట్టి మరిన్ని వాహనాలను నడుపుతామని తెలిపారు. వీటితోపాటు మరో 6 వేల ప్రైవేటు వాహనాలను నడుపుతున్నట్లు చెప్పారు. రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలను పెంచామని, అన్ని శాఖల సహకారంతో సమ్మె ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు.

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మొత్తం కార్మికుల సంఖ్య: 50,000 
విధులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించిన వారి సంఖ్య: 10,000
సెల్ఫ్‌ డిస్మిస్‌ అయినట్లు ప్రభుత్వం ప్రకటించిన వారి సంఖ్య: 48,500
ఆర్టీసీ ద్వారా నడపాలని నిర్ణయించిన బస్సులు:10,000
ఇందులో పూర్తిగా ప్రభుత్వమే నడిపేవి: 5,000
వీటి కోసం కావాల్సిన పూర్తి సిబ్బంది సంఖ్య(అంచనా): 28,000

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా