నాయక్‌ నహీ..!

1 Apr, 2018 07:06 IST|Sakshi
మంత్రి చందూలాల్

లంబాడీ ప్రతినిధుల భేటీకి మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ దూరం

రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ

టీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత సమస్య

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : తండాలకు పంచాయతీ హోదా కల్పించడంపై రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆ వర్గం వారు సంబరాలు జరుపుకుంటున్నారు. పలువురు లంబాడీ వర్గం ప్రజాప్రతినిధులు, ముఖ్యులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి కృతజ్ఞతలు సైతం తెలిపారు. అధికార పార్టీకి చెందిన లంబాడీ వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. అయితే ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రి చందులాల్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్‌ అధిష్టానమే వీరిద్దరికీ ప్రాధాన్యత లేకుండా చేసేందుకు కార్యక్రమానికి ఆహ్వానించలేదా... వీరే దూరంగా ఉన్నారా.. అనే అంశంపై అధికార పార్టీలో చర్చ జరుగుతోంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో లంబాడీ వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రాతినిథ్యం ఎక్కువగా ఉంది. ఎస్టీ వర్గానికి రిజర్వ్‌ అయిన అన్ని నియోజక వర్గాల్లో లంబాడీ వర్గం వారే గెలిచారు. మహబూబాబాద్‌ ఎంపీగా అజ్మీరా సీతారాంనాయక్, ములుగు ఎమ్మెల్యేగా ఎ.చందులాల్, డోర్నకల్‌ ఎమ్మెల్యేగా డీఎస్‌.రెడ్యానాయక్, మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా బి.శంకర్‌నాయక్‌ గత ఎన్నికల్లో గెలిచారు. తండాలను పంచాయతీలుగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ వర్గం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికార పార్టీ ముఖ్యులు వెళ్లారు. స్వయంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అజ్మీరా చందులాల్‌ ఈ కార్యక్రమంలో లేకపోవడం ములుగు నియోజకవర్గంలో పెద్ద అంశంగా మారింది. అనారోగ్య సమస్యల వల్ల కొంత కాలంగా చందూలాల్‌ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల పరిస్థితిలో మార్పు రాగా.. నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమయంలో తండాలను పంచాయతీలుగా గుర్తిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న వేళ గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్‌ బయటకు రాకపోవడం చర్చకు దారితీసింది. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ దూరంగా ఉండడం... ఈ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎం.కవిత హాజరుకావడం ఆసక్తి కలిగిస్తోంది. 
వర్గ పోరు..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఎస్టీ కేటగిరి అసెంబ్లీ నియోజవర్గాలలో వర్గపోరు కొనసాగుతోంది. ములుగు నియోజకవర్గంలో మంత్రి చందూలాల్‌కు, ఎంపీ సీతారాంనాయక్‌ వర్గాల మధ్య పొసగడంలేదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సీతారాంనాయక్‌ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఇక్కడ చందూలాల్‌ వర్గానికి ఇబ్బంది కలిగిస్తోంది. వీరి మధ్య వర్గపోరు కొన్నిసార్లు బహిరంగంగానే సాగి.. ఫ్లెక్సీల చించివేతల వరకు వెళ్లింది. అలాగే మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు, ఎంపీ సీతారాంనాయక్‌కు ఇదే పరిస్థితి ఉంది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఎంపీ సీతారాంనాయక్‌ సన్నిహితుల వద్ద చేసిన వ్యాఖ్యలతో శంకర్‌నాయక్‌ వర్గంలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఈ సెగ్మెంట్‌లో సైతం ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు. మరోవైపు మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే మాలోత్‌ కవిత వర్గానికి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ వర్గానికి మధ్య ఇదే పరిస్థితి ఉంది. డోర్నకల్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే డీఎస్‌.రెడ్యానాయక్‌కు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన సత్యవతి రాథోడ్‌కు మధ్య రాజకీయంగా పొసగడంలేదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి దగ్గర జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులు లేకపోవడం ఆసక్తిని పెంచుతోంది. టీఆర్‌ఎస్‌ అధిష్టానమే వీరిద్దరి ప్రాధాన్యత తగ్గించిందా.. లేక వీరిద్దరే ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నారా అనే అంశంపై స్పష్టత రావడంలేదు. ఈ రెండు అంశాలలో ఏది జరిగినా వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంపై ఇప్పుటి నుంచే ఆసక్తికర అంచనాలు మొదలయ్యాయి.  

మరిన్ని వార్తలు