‘ఉపాధి హామీ నిధుల వినియోగంలో ముందుండాలి’

23 Jul, 2019 15:44 IST|Sakshi

హైదరాబాద్: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామాలకు అభివృద్ధి నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కల సంరక్షణ ఆధారంగానే జీపీ భవనాలు, సీసీ రోడ్లు మంజూరు చేస్తామని పేర్కొన్కారు. దీంతోపాటు ఉపాధి హామీపథకం నిధుల వినియోగంలో రాష్ట్రం ముందుండాలని సూచించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సదస్సులకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠధామం కచ్చితంగా నిర్మించాలన్నారు. కాగా ఉపాధి హామీ పనులు గ్రామ పంచాయతీ ఆమోదంతో జరగాలని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో ఉండాలని సూచించారు.

మరిన్ని వార్తలు