కేంద్రం కంటే రాష్ట్ర పథకం చాలా బెటర్‌ : ఈటల రాజేందర్‌

10 Oct, 2019 18:35 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ కంటే తెలంగాణలో ఉన్న ఆరోగ్య శ్రీ పథకం మెరుగైందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగుతున్న సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ సమావేశానికి కో చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ గురువారం హాజరయ్యారు. చైర్మన్‌గా కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌, వైస్‌ చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్‌ కుమార్‌ వ్యవహరించారు. ఈ సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. ఆయుష్మాన్‌ భారత్‌ వల్ల తెలంగాణలో 24 లక్షల మంది మాత్రమే లబ్దిదారులుండగా, ఆరోగ్య శ్రీ వల్ల 85 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు.

కేంద్ర పథకం వల్ల గరిష్టంగా రూ. 5 లక్షల వరకు మాత్రమే వైద్య సేవలుండగా, ఆరోగ్య శ్రీ ద్వారా మూత్ర పిండాలు, గుండె మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలకు గరిష్టంగా రూ. 13 లక్షల వరకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ వంటి ప్రోగ్రెసివ్‌ స్టేట్స్‌కి కేంద్రం ఎక్కువ మద్దతునందించి, నిధులను నేరుగా అందించాలని ఈటల కోరారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ సేవల పరిధిని పెంచి, సిబ్బంది జీతభత్యాలను భరించాలని ఈటల ఈ సందర్భంగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సమావేశాల వల్ల కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం పెరుగుతుందని ఆశిస్తున్నట్టు మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.       

మరిన్ని వార్తలు