'తెలంగాణకు అదనంగా బియ్యం కేటాయించండి'

22 Aug, 2015 19:02 IST|Sakshi

హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రతీ నెలా అదనంగా 68,500 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వ్యవహారాల మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌కు రాష్ట్ర ఆర్దిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన పాశ్వాన్‌తో మంత్రి ఈటల శనివారం ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. అదనంగా ఇచ్చే బియ్యాన్ని కిలోకు రూ.8.43 చొప్పున ఇచ్చినా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. సంక్షేమ హాస్టళ్లకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యం కోటాను 3432 మెట్రిక్ టన్నుల నుంచి 9018 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ఈటల విజ్ఞప్తి చేశారు.

అలాగే హమాలీ చార్జీలను కూడా రూ.20 మేర పెంచాల్సిందిగా కోరారు. ముడి బియ్యానికి వసూలు చేసే కస్టమ్ మిల్లింగ్ ఛార్జీలను రూ.15 నుంచి రూ.20కు, బాయిల్డ్ రైస్‌కు రూ.25 నుంచి రూ.50కి పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సమర్పించిన పలు వినతులను గుర్తు చేస్తూ, సంబంధిత పత్రాలను కేంద్ర మంత్రి పాశ్వాన్‌కు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ వినతులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో పాటు, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి హామీ ఇచ్చారని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.
 

>
మరిన్ని వార్తలు