‘రైతుకు అండగా నిలుస్తున్నాం’

3 Sep, 2017 14:55 IST|Sakshi
‘రైతుకు అండగా నిలుస్తున్నాం’
కరీంనగర్‌: గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు నెలకొన్నాయని రాష్ట్ర ఆర్థిక​ మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు. గత మూడున్నరేళ్లలో ప్రజారంజక పాలన అందిస్తూ రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్నామని అన్నారు. కరీంగనర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సంతోషంగా గడుపుతున్నారని చెప్పారు. దేశంలో గొప్ప మానవ ప్రయత్నం  కాళేశ్వరం ప్రాజెక్టు అని, సీఎం స్వయంగా సీసీ కెమెరాలతో ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
 
దేశంలో ఎక్కడా లేని విధంగా వచ్చే ఖరీప్‌ నుంచి ఎకరానికి రూ. 4వేలు చొప్పున రెండు పంటలకు రైతుకు పెట్టుబడిగా ఇవ్వడానికి సమన్వయ కమిటీలు, భూసమస్యలు పరిష్కరించడానికి సమగ్ర భూసర్వే చేపడుతున్నామని ఈటల తెలిపారు. రైతు సమన్వయ కమిటీలో ప్రతి కులానికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని, ఇప్పటికే కమిటీల ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని చెప్పారు. ఈ నెల 9 నుంచి కమిటీలకు ఆరు రోజులపాటు శిక్షణ ఇస్తామన్నారు. అనేక గ్రామాల్లో భూముల కంటే పాసుబుక్‌లే ఎక్కువగా ఉన్నాయన్నారు.
 
భూసర్వేతో అలాంటి ఇబ్బందులను అధిగమిస్తామని, మూడు నెలల్లో భూసర్వే పూర్తి చేస్తామని వివరించారు. నదుల అనుసంధానంపై కేంద్రానికి చిత్తశుద్ది ఉంటే తాము తప్పకుండా సహకరిస్తామన్నారు. మిడ్‌ మానేరు నిర్వాసితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఈటల హామీ ఇచ్చారు.
 
 
మరిన్ని వార్తలు