టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు : మంత్రి జగదీశ్‌ రెడ్డి

1 Dec, 2018 14:32 IST|Sakshi
అనంతారంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

సాక్షి, పెన్‌పహాడ్‌ (సూర్యాపేట) : నాలుగున్నరేళ్ల పాలనలో మా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు గ్రామాలకు వెళ్తున్న తమకు, టీఆర్‌ఎస్‌ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, అనంతారం, పొట్లపహాడ్, దూపహాడ్, లింగాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి భయపడిపోయిన ప్రతిపక్షాలు ప్రజాకూటమి పేరుతో జతకట్టాయన్నారు. ప్రజాదరణ ముందు ఈ కూటమి మట్టికొట్టుకుపోనుందని ఎద్దేవా చేశారు. మాకు అధికారమే ముఖ్యం కాదని.. అభివృద్ధే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లాం.. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా జరగని అభివృద్ధి, ఏ రాష్ట్రంలో చేపట్టని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని తెలిపారు. 14ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్‌ఎస్‌తోనే మన బతుకులు మారతాయన్నారు. రైతులు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి అప్పుల పాలయ్యారని వ్యవసాయం బతికిస్తేనే ఊర్లు బాగుంటాయని ఉద్దేశంతో రూ.లక్ష రుణమాఫీ చేయడం జరిగిందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా 24గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని సోనియా, మోదీ రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందన్నారు. తెలంగాణను దోచుకోవడానికి రెండు ఆంధ్రా పార్టీలు పగటి దొంగలుగా వస్తున్నాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌కు రూ.500కోట్ల ఇచ్చి చంద్రబాబునాయుడు చేతిలో తోలు బొమ్మలుగా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఎస్సార్‌ఎస్పీ కాల్వల ద్వారా సాగునీరు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకునేందుకు 35ఉత్తరాలు రాశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే చంద్రబాబుకు వేసినట్లే అన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు రాకుండా కాంగ్రెస్‌ నాయకులే అడ్డుపడ్డారన్నారు. అనంతరం అనంతారం, సింగారెడ్డిపాలెం గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీపీ భుక్యా పద్మ, ఒంటెద్దు నర్సింహారెడ్డి, నెమ్మాది భిక్షం, మారిపెద్ది శ్రీనివాస్, మిర్యాల వెంకటేశ్వర్లు, పుట్ట రేణుకాశ్రీనివాస్‌గౌడ్, దంతాల వాణివెంకన్న, మామిడి అంజయ్య, చిట్టెపు నారాయణరెడ్డి, పొదిల నాగార్జున, సామ వెంకటరెడ్డి, పేర్ల శ్రీధర్, మున్నా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు