కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే.. బాబుకు వేసినట్లే : మంత్రి జగదీశ్‌ రెడ్డి

3 Dec, 2018 10:56 IST|Sakshi
బి.చందుపట్లలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

సాక్షి, సూర్యాపేట : కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే చంద్రబాబుకు వేసినట్లేనని.. రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూస్తుంటే దేశంలో కేసీఆర్‌కు తప్ప మరెవరికి ఇంతటి ప్రజామద్దతు లేదన్నారు. ఆదివారం పట్టణంలోని వాణిజ్యభవన్‌ సెంటర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత స్థానం భవన నిర్మాణ రంగానిదే అన్నారు. భవన నిర్మాణ రంగం కార్మికుల పిల్లలకు కల్యాణలక్ష్మితో పాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో పెద్దపీట వేస్తామన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 లక్షలు, వికలాంగులైతే రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే వస్తున్నాయన్నారు. తనను మరోసారి గెలిపిస్తే పేట ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందజేస్తామన్నారు. అదే విధంగా గండూరి జానకమ్మ ఇండోర్‌ స్టేడియంలో ది క్లాత్‌ మర్చంట్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, ఆకుల లవకుశ, శనగాని రాంబాబుగౌడ్, ఉప్పల ఆనంద్, గండూరి కృపాకర్‌ పాల్గొన్నారు.  
కాంగ్రెస్, టీడీపీ ఇక కనుమరుగే..
సూర్యాపేటరూరల్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ ఇక కనుమరుగు కానున్నాయని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసే భారీగా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఆదివారం మండలంలోని గాంధీనగర్‌లో ఎంపీపీ వట్టే జానయ్యయాదవ్‌ నివాసంలో బాలెంల గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పలువురు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఈ శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన శివరాత్రి భిక్షపతి, దుండగుల వెంకన్నతో పాటు మరో 50 మందికి టీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, పులగం వెంకట్‌రెడ్డి, మామిడి రవి, టైసన్, రూపని శ్రీను, పల్స నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
బాబు చేతుల్లో కీలుబొమ్మ కాంగ్రెస్‌ ..
చివ్వెంల : చంద్రబాబు నాయుడు చేతులో కాంగ్రెస్‌ కీలుబొమ్మగా మారిందని ఆపద్ధర్మ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని బి.చందుపట్ల, పాశ్చతండా గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2014కు ముందు ఆకలిచావులు ఉండేవని టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ప్రజలు గౌరవంగా బతుకుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌ తీసుకొచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌దే అన్నారు. దేశంలో 45వేల కోట్ల రూపాయలు సంక్షేమ రంగం కోసం ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశాన్ని ఉద్దరించామని గొప్పలు చెప్తున్న సోని యాగాంధీ, రాహుల్‌గాంధీకి రాజకీయ భిక్షపెట్టిన ఉత్తరప్రదేశ్‌లోని రెండు వేల గ్రామాల్లో ఇప్పటికీ కరెంట్‌ లేదన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఖరీప్‌ నుంచి పది నెలల పాటు సాగునీరందిస్తామన్నారు. తెలంగాణకు అడ్డుపడ్డ చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. పేట ప్రజలు మరోసారి తనను ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతానన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్‌సభ్యుడు షేక్‌బాషా, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, పెద్దగట్టు చైర్మన్‌ శ్రీనివాస్‌యాదవ్, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ భూక్యా వెంకటేశ్వర్లు, చందుపట్ల పద్మయ్య, మారినేని సుధీర్‌రావు, వేముల చిన్న, మిర్యాల గోవిందరెడ్డి, వెంకన్న పాల్గొన్నారు.

మరిన్ని వార్తాలు...  

మరిన్ని వార్తలు