డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్‌

15 Nov, 2019 15:43 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: అన్ని హంగులతో లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం సింగూర్‌లో 150 మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, 141 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ  చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కొత్త ట్రాక్టర్లను సర్పంచ్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అమరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయిందన్నారు.

పేదల కోసం ముఖ్యమంత్రి కట్టించిన ఇళ్లల్లో పేదలు మాత్రమే నివసించాలని..వాటిని అమ్ముకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.  పేదల కోసం డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్లు, రైతుల కోసం రైతు బంధు బీమా, 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను  ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. నిత్యం ప్రజల సంక్షేమం కోసమే కేసీఆర్‌ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. దేశమంతటా వర్షాలు పడి ప్రాజెక్టులు పొంగిపొర్లుతుంటే  సింగూర్ లో మాత్రం చుక్క వర్షం పడటం లేదని.. భవిషత్తులో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సింగూర్‌ నింపుతామన్నారు. 40 వేల ఎకరాలకు రెండు పంటలకు నీరందిస్తామని పేర్కొన్నారు. అందోల్‌ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.

పేదలకు అండగా ఉంటాం..
మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. పేదలకు ఇళ్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇళ్లు లేని పేదలకు వచ్చే ఏడాదిలోగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అందిస్తామని వెల్లడించారు. కేసీఆర్‌ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చెప్పారు.

మరిన్ని వార్తలు