ప్రయాణం చేసొచ్చాయి; జాగ్రత్త : మంత్రి హరీష్‌ రావు

15 Oct, 2019 13:15 IST|Sakshi
మంత్రి హరీష్‌ రావు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, సిద్ధిపేట : రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధరతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం దొరుకుతుందని ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక మార్కెట్‌ యార్డులో ఆయన 200 మంది రైతులకు పాడి ఆవులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆవులు మంచి సెంటిమెంట్‌ అని ఏ పూజ చేసినా, పుణ్యకార్యం చేసినా గోపూజ ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆవులను తరలించామని, అలసిపోయుంటాయి కాబట్టి రైతులు వాటికి వేడి నీళ్లతో స్నానం చేయించాలని సూచించారు. లక్ష రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఆవులకు తగిన ఇన్సూరెన్స్‌ కూడా చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఒక ప్రక్రియలా నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సేంద్రీయ వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించిన నియోజకవర్గ రైతులను హరీష్‌రావు సన్మానించారు. 

మరిన్ని వార్తలు