కేంద్రానిది పనికిమాలిన నిర్ణయం

5 May, 2017 02:31 IST|Sakshi
కేంద్రానిది పనికిమాలిన నిర్ణయం

మిర్చి కొనుగోళ్ల ప్రకటనపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం
కేంద్రం ప్రకటించిన పథకం మిలీనియం జోక్‌ అని ఎద్దేవా


సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం మిర్చి కొనుగోళ్లకు సంబంధించి అస్పష్ట నిర్ణయంతో రైతులకు శఠగోపం పెట్టిందని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. సమస్యను కేంద్రం అర్థం చేసుకోలేదని, ఫలితంగా మిర్చి రైతులకు ఏమాత్రం మేలు చేయని, పనికిమాలిన నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌లతో కలసి హరీశ్‌ విలేకరులతో మాట్లాడారు. మిర్చి కొనుగోళ్లపై కేంద్రం ప్రకటించిన పథకం ఓ మిలీనియం జోక్‌ అని ఆయన ఎద్దేవా చేశారు. మిర్చికి క్వింటాలుకు రూ. 5 వేల ధర ప్రకటించి నాణ్యత ఉన్న వెరైటీనే కొంటామనడం, అదీ 3 లక్షల 37వేల క్వింటాళ్లనే కొనుగోలు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మరి రైతుల దగ్గర మిగిలిన 35 లక్షల క్వింటాళ్ల మిర్చి సంగతేమిటని హరీశ్‌ ప్రశ్నించారు. తేజ రకం మిర్చికి మార్కెట్‌లో ఇప్పటికే రూ. 6 వేల నుంచి రూ. 6,500 దాకా ధర పలుకుతోందని, మరి కేంద్రం ఇచ్చే రూ. 5 వేలు రైతును ఆదుకోవడానికా లేక ముంచడానికా అని నిప్పులు చెరిగారు. మిర్చిని రూ. 10 వేలకు కొనాలని స్థానిక బీజేపీ నేతలు ధర్నాలు చేస్తుంటే కేంద్రం మాత్రం రూ. 5 వేలే ఇస్తానంటోందని ఎద్దేవా చేశారు.

అడిగింది రూ.7 వేలు.. ఇస్తానన్నది రూ. 5 వేలు
‘‘ప్రభుత్వం తరఫున క్వింటాలుకు రూ. 7 వేలు అడిగితే కేంద్రం ఇస్తామన్నది ముష్టి రూ. 5 వేలు. మిర్చి ధరపై కేంద్రానికి రాష్ట్రం నుంచి ఎలాంటి వినతులు ఇవ్వలేదని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అనడం దారుణం. మార్చి 30న ఎంపీ బి.వినోద్‌ కుమార్‌ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలసి వినతిపత్రం ఇచ్చారు. అదే నెల 31న వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి పార్ధసారథి కేంద్రానికి లేఖ రాశారు. ఏప్రిల్‌ 1న నేను స్వయంగా లేఖ రాశా. ఈ లేఖల్లో స్పష్టత లేదని దత్తాత్రేయ తాజాగా అనడం మరో అబద్ధం.

ఏ అంశంలో స్పష్టత లేదో కేంద్రం రాష్ట్రాన్ని ఎందుకు వివరణ అడగలేదు? ఈ లేఖలపై స్పందించడానికి కేంద్రానికి నెల రోజులుగా తీరిక లేకుండా పోయిందా..’’ అని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. కేంద్రం స్పందన దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రకటించిన పథకమే అస్తవ్యస్తంగా ఉందని, కొనుగోళ్లకు డబ్బులు ఇవ్వబోమని, రాష్ట్రమే కొనుగోళ్ల భారం మోయాలనడం, చివర్లో ఏదో ఇస్తామనడం విచిత్రంగా ఉందన్నారు.

 చివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 20 కోట్లకు మించి రావని వివరించారు. కేంద్రం నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, పదేళ్లు పాలించిన ఎన్డీయే మిర్చికి ఎందుకు మద్దతు ధరలు ఇవ్వలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. కోల్డ్‌ స్టోరేజీ అనుమతుల కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా అతీగతీ లేదని, విపక్షాలు రైతు సమస్యలను రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.

రూ.7 వేలు ధర ప్రకటించండి
రాష్ట్రంలోని మిర్చి రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.ఏడు వేల ధర ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రతి క్వింటాల్‌కు అదనపు ఖర్చుల కింద రూ.1,500 ఇస్తేనే రైతుకు గిట్టుబాటు ఉంటుందని పేర్కొంది. గురువారం ఈ మేరకు మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం కింద క్వింటాల్‌ మిర్చిని రూ.5 వేల చొప్పున కొనుగోలు చేస్తామని చేసిన ప్రకటనతో తెలంగాణ రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారని లేఖలో ప్రస్తావించారు.

ఇప్పటికే వరంగల్, ఖమ్మం వంటి పెద్ద మార్కెట్లలో నాణ్యమైన మిర్చి క్వింటాల్‌కు రూ.5 వేల పైనే ధర పలుకుతోందని తెలిపారు. కేంద్రం రూ.ఏడు వేలు చెల్లిస్తేనే రైతుకు గిట్టుబాటుగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని రైతుల వద్ద ఇంకా 3 వేల మెట్రిక్‌ టన్నుల మిర్చి నిల్వలున్నాయని, కేంద్రం కేవలం 33,700 మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతిచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు న్యాయం చేసేలా మొదటి, రెండో రకం మిర్చి మొత్తం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు