ప్రాణాయామం చాలా కీలకం: మంత్రి హరీష్‌రావు

12 Feb, 2020 19:58 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: యోగాలో ప్రాణాయామం చాలా కీలకమైనదని ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..సంగారెడ్డి నడి బొడ్డున 80 లక్షలతో యోగా భవనం, రెండు కోట్లతో బిర్లా సైన్స్ మ్యూజియాన్ని నిర్మిస్తున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్ తరువాత సంగారెడ్డిలో మ్యూజియంను నిర్మిస్తున్నామని, మ్యూజియాలను సందర్శించడం ద్వారా పిల్లల్లో నాలెడ్జి పెంపొందుతుందని పేర్కొన్నారు. యోగా వలన వంద ఏళ్లకు పైగా బతికారని తరుచు వింటుంటామని, గాలి పీల్చి రుషులు బతికేవారని అన్నారు. ఇప్పుడు జీవన విధాన మార్పు, శ్రమ తగ్గడం వల్ల బీపీ, షుగర్, గుండెపోటు వంటివి రోగాలు పెరిగాయని అన్నారు. రోగాలు రాకుండా ఉండాలన్నా, ఒత్తిడిని అధిగమించాలన్నా యోగా అవసరమని తెలిపారు. 

మనిషి ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాలి..లేకుంటే మనిషికి చివరగా ఔషధమే మిగులుతుందని అన్నారు. వందేళ్లు  బతకాలనుకునే వారు ప్రాణాయామం చేయాలని, తాబేలు నాలుగు సార్లు శ్వాస తీసుకుని మూడు వందల ఏళ్ళు బతుకుతుందని అన్నారు. ఏనుగు 9 సార్లు శ్వాస తీసుకుని 150 ఏళ్ళు బతుకుతుందని, డాక్టర్ దగ్గరకు పోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని, రోజుకు ఒక గంట యోగాకు కేటాయించాలని సూచించారు. యోగా, ప్రాణాయామం చేయడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి , ఏకాగ్రత పెరుగుతాయని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తప్పని సరిగా యోగాను నెర్పించాల్సిందేనని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

చదవండి: ఫలించిన హరీష్‌ రావు వ్యూహాలు.. జగ్గారెడ్డికి ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు