రాజకీయ నేతలకు కరోనా భయం

13 Jun, 2020 11:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ రాజకీయ నేతలను వెంటాడుతోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. గతరెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ముత్తిరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యేకు వైరస్‌ సోకడంతో ఆయన వెంట తిరిగిన నాయకులు, కార్యకర్తలంతా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఆయన సమీప వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. (కరోనా కల్లోలంలో హైదరాబాద్‌ బిర్యానీ!)

మరోవైపు ఇప్పటి వరకు సేఫ్‌ జోన్‌గా సిద్దిపేటలో కరోనా కలకలం రేపుతోంది. మంత్రి హరీష్‌ రావు సమీప వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. మంత్రి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. మరోవైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సైతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది, అధికారుల్లో కొంతమంది వైరస్‌ సోకడంతో ఎంపీ ముందస్తు జాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారెంటైన్‌కు వెళ్లారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. మరోవైపు జీహెచ్‌ఎంసీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. నేడు మరోసారి మేయర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. మరికొందరు రాజకీయ ప్రముఖులు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు హైదరాబాద్‌ పయనమైనట్లు సమాచారం. (భయం గుప్పిట్లో సిద్దిపేట!)

ఇక భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి రావడంతో ముందు జాగ్రత్త చర్యగా కలెక్టర్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌కు వెళ్లారు. దీంతో జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు అంతా అప్రమత్తమయ్యారు. కలెక్టర్‌ కార్యాలయంలోని పలువురు అధికారులు, వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బంది, రాజకీయ నాయకులు.. ఒక్క శుక్రవారం రోజే మొత్తం 34 మంది తమ గొంతు స్రావాలను సిద్దిపేట జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పరీక్షలకు ఇచ్చారు. (స్వీయ నిర్బంధంలోకి సిద్దిపేట కలెక్టర్‌)

మరిన్ని వార్తలు