కాళేశ్వరానికి రూ.20 వేల కోట్లివ్వండి

11 Aug, 2018 02:52 IST|Sakshi
గడ్కరీతో సమావేశమైన హరీశ్‌రావు, జితేందర్‌

కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన మంత్రి హరీశ్‌రావు

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర సాయంగా రూ.20 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని మంత్రి హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలో చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులు, వాటికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై శుక్రవారం ఢిల్లీలో గడ్కరీతో చర్చించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు కేంద్ర సాయంగా ఇవ్వాలని హరీశ్‌ కోరారు. ఇదే విషయమై గత వారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను ప్రధానికి వివరించిన కేసీఆర్‌ ప్రాజెక్టుకు కేంద్ర సాయంగా రూ.20 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఈ విషయంపై గడ్కరీతో హరీశ్‌ చర్చించారు.

ఇక దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబోమని శుక్రవారం లోక్‌సభలో గడ్కరీ ప్రకటన చేయడంపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఏపీ విభజన చట్టంలో ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని, అదే చట్టం ద్వారా ఏర్పడ్డ తెలంగాణలోనూ ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లో ఏదో ఒకదాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ అంశాన్ని కూడా హరీశ్‌రావు ప్రస్తావించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టను సందర్శించేందుకు రావాలని గడ్కరీని ఈ సందర్భంగా ఆహ్వానించారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతుల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు