ఈ నెల 26లో లక్ష్యాలను సాధించాలి: హరీష్‌రావు

17 Feb, 2020 20:04 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రామాన్ని అమలు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా  జిల్లా స్థాయిలో పంచాయతీ రాజ్‌ సమ్మేళానాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ: ఎక్కడ లేనివిధంగా.. పారిశుద్ధ్య సమస్య లేకుండా ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వందే అన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం, డంప్ యార్డ్ నిర్మాణం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కాగా  ప్రతి గ్రామం ఈ నెల 26 లోపు పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలన్నారు. 26వ తేదీ తర్వాత  స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో సహా మంత్రులు, ఉన్నతాధికారులు గ్రామాల్లో పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేయబోతున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో పల్లె ప్రగతి లక్ష్యాలను ప్రతి గ్రామం చేరుకోవాలని... లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం గ్రామాల్లో చెత్త సేకరణ, వైకుంఠ ధామం, డంప్ యార్డ్, ఇంకుడు గుంతలు, నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. హరితహారం, నర్సరీ, ట్రాక్టర్ల ద్వార చెత్త సేకరణతో పాటు పూర్తిస్థాయిలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నారు. ఇక పల్లె ప్రగతితో తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని, రూ. 500 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని, తాగునీటికి శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా త్వరలోనే నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పల్లె ప్రగతి అమలులో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలవాలి తాను కోరుకుంటున్నానని మంత్రి పేర్కొన్నారు. 

సీఎం కేసీఆర్‌ జన్మది కార్యక్రమంలో మొక్కలు నాటిన మంత్రి...
సీఎం కేసీఆర్ జన్మదినం వేడుకలో భాగంగా కంది మండలం కవలంపేట గ్రామంలో  2200  మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌రావు, కలెక్టర్‌ హనుమంతరావులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం  కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం అయిందని పేర్కొన్నారు. ఆయన  చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ , ఆదర్శ తెలంగాణ రాష్ట్రంగా  మారుతుందని పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యుడి పుట్టినరోజును జరుపుతున్నట్లుగా రాష్ట్రమంతట సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు