ఎస్సారెస్పీ ఆయకట్టు కోసం అదనపు పథకం

10 Mar, 2017 03:19 IST|Sakshi
ఎస్సారెస్పీ ఆయకట్టు కోసం అదనపు పథకం

ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా జలాల తరలింపు
మంత్రివర్గ ఉపసంఘం సూచన
ముఖ్యమంత్రికి సిఫారసు చేయాలని నిర్ణయం
రూ.650 కోట్ల అంచనాతో ఎత్తిపోతలు


సాక్షి, హైదరాబాద్‌:  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని పూర్తి ఆయకట్టు స్థిరీకరణ కోసం అదనపు (సప్లిమెంటేషన్‌) పథకాన్ని చేపట్టాలని నీటిపారుదలరంగంపై నియమిం చిన మంత్రివర్గ ఉపసంఘం  అభిప్రాయ పడింది. ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి నీటిని తరలించేలా ప్రణా ళికకు ఓకే చెప్పింది. వరద కాల్వపై మూడు ఎత్తిపోతల పథకాలను నిర్మించి, ఎల్లంపల్లి ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సిఫారసు చేయా లని ఉపసంఘం నిర్ణయించింది.

 గురువారం సచివాలయంలో ఎస్సారెస్పీ వరద కాలువపై కేబినెట్‌ సబ్‌కమిటీ సుదీర్ఘంగా సమీక్షించింది. సబ్‌ కమిటీ చైర్మన్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వర్షాలు కురవని సంవత్సరాలలో శ్రీరాంసాగర్‌ (ఎస్సారెస్పీ) పరిధిలోని రైతాంగం ఇబ్బందులకు గురి కాకుండా సాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయాలపై చర్చించారు. అతి తక్కువ భూసేకరణతో వేగంగా పూర్తి చేసే మార్గాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ స్థితిగతులపై ఇంజనీర్లు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

రోజుకు 0.75 టీఎంసీల నీరు తరలింపు..
నిజానికి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ పూడిక కారణంగా 80 టీఎంసీలకు తగ్గిపోయింది. ప్రాజెక్టు లక్ష్యం ప్రకారం 9 లక్షల 73 వేల ఎకరాలకు సాగునీరందడానికి 95 టీఎంసీలు కావాలి. ఎగువ ప్రాంతాల్లో బాబ్లీ వంటి ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల శ్రీరాంసాగర్‌కు ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ఎస్సారెస్పీలో 54 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉన్నది. ఫలితంగా పూర్తి ఆయకట్టుకు నీరందించడం కష్టంగా మారిందని ఇంజనీర్లు తెలిపారు. ఈ దృష్ట్యా దాదాపు రూ.650 కోట్ల వ్యయ అంచనాలతో 31 మీటర్ల ఎత్తున లిఫ్ట్‌ నిర్మించి ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ వరకు నీటి తరలింపు పథకాన్ని ప్రతిపాదించారు.

రోజుకు 0.75 టీఎంసీల నీటిని ఈ పథకం నుంచి సరఫరా చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీనిపై కమిటీ స్పందిస్తూ, ఈ పథకాన్ని 10 నెలల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. వరద కాలువలో అవసరమైన చోట్ల లైనింగ్‌ పనులు జరపాలని సూచించింది. మిడ్‌ మానేరు ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నందున ఈ సంవత్సరం ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు అనుసంధానం చేస్తున్నట్టు హరీశ్‌రావు తెలిపారు.

 ఈ అనుసంధానంలో భాగంగా రోజుకు 0.75 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్‌ లోకి ఎత్తిపోసేందుకు సంకల్పించామన్నారు. ప్రస్తుతం కేబినెట్‌ సబ్‌ కమిటీ సూచించిన ఎస్సారెస్పీ సప్లిమెంటు పథకం ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పై ఆధారపడిన కాకతీయ, సరస్వతీ, లక్ష్మి కెనాల్‌లు సహా ఇతర ఎత్తిపోతల పథకాల ఆయకట్టును స్థిరీకరించడం, ప్రాజెక్టు పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాలతో పాటు జగిత్యాల, మెట్‌పల్లి ప్రాంతాల్లోని మెట్ట భూములకు లక్ష ఎకరాలలో సాగు నీరందే అవకాశం ఉంది. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగరరావు, స్పెషల్‌ సీఎస్‌ జోషి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు