చిమ్నీబాయి నీళ్లు ముట్టింది...!

28 Oct, 2016 01:44 IST|Sakshi
చిమ్నీబాయి నీళ్లు ముట్టింది...!

సాక్షి, సంగారెడ్డి: నారాయణఖేడ్  ఉప ఎన్నికల సందర్భంగా ఓ మహిళా ఓటరుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండాను సందర్శించారు. ప్రచారంలో భాగంగా  తండాకు వచ్చిన హరీశ్‌కు ఆమె మంచినీరు, విద్యుత్తు సమస్యలను ఏకరువు పెట్టింది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో తమ తండావాసులకు పిల్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలు తీరిస్తే కోడికూర.. జొన్నరొట్టె పెడతానని చమత్కరించింది. తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
 
120 కుటుంబాలు ఉన్న సర్దార్ తండాకు తొమ్మిది నెలల వ్యవధిలో త్రీ ఫేజ్ విద్యుత్తు, రూ.10 లక్షలతో పైప్‌లైన్  వేసి తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన చిమ్నీబాయి మంత్రిని కలసి తండాకు రావాలని కోరింది.  మంత్రి ప్రారంభిస్తే తప్ప ‘మంచినీటిని తాగం.. కరెంటును వాడబోమని చెప్పింది’. చిమ్నీబాయి  కోరిక మేరకు మంత్రి హరీశ్ గురువారం కంగ్టి మండలం సర్దార్ తండాకు వెళ్లి.. మంచినీటి కుళాయిని ప్రారంభించారు. చిమ్నీబాయి ఇంటికి వెళ్లి  తండాలో సీసీ రోడ్లకు రూ.10 లక్షలు మం జూరు చేసిన ప్రతిని ఆమెకు అందజేశారు.
 
తండాలోని ఇతర సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా వివిధ ప్రభుత్వ శాఖల ఇంజనీరింగ్ విభాగం అధికారులను మంత్రి ఆదేశించారు. ‘తండాలో కాళుబాబా ఉత్సవాలు జరుగుతున్నందున మంత్రికి కోడికూర, జొన్నరొట్టె పెట్టలేక పోతున్నా.. మరోమారు రావాలి’ అని మంత్రి హరీశ్‌రావును కోరింది. కాగా, కంగ్టి మండలం బోర్గీ పంచాయతీ పరిధిలోని సర్దార్ తం డాలో నిర్వహిస్తున్న గిరిజనుల ఆరాధ్యదైవం జ్వాలాముఖి కాళుబాబా విగ్రహప్రతిష్ఠాపనకు మంత్రి హాజరయ్యారు.
 

మరిన్ని వార్తలు