కందులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

22 May, 2020 20:53 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట: రైతు సంస్కరణలలో సిద్ధిపేట ఆదర్శం కావాలని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నియంత్రిత పంటల సాగుపై శుక్రవారం జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజా శర్మ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, బొడకుంట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
(వివాదంగా మారిన ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకలు)

పంట మార్పిడితో రైతులకు మేలు..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంటల మార్పిడి ద్వారా దిగుబడి పెరిగి రైతుకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రానికి ఒక తండ్రిలాగా రైతుల సంక్షేమానికి పరితపిస్తున్నారని చెప్పారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. మార్కెట్‌, అంతర్జాతీయంగా పంటలకు ఉన్న డిమాండ్ ఆధారంగా సాగు చేయాలని ఆయన సూచించారు.
(పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల)

ప్రభుత్వం ఉద్దేశ్యం అది కాదు..
రైతు బంధు పథకం ఆపాలని ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రతి రైతుకు రైతు బంధు అందిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రైతు బంధు కోసం రూ.7 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టామని చెప్పారు. వానాకాలం లో మొక్కజొన్న దిగుబడి బాగా తగ్గుతుందని.. అందుకే ఇతర పంటలపై దృష్టి పెట్టాలని ఆయన వివరించారు. యాసంగిలో వరికి రాళ్ళ వానతో నష్టం జరుగుతుందని.. అదే మొక్కజొన్న అయితే ఎలాంటి నష్టం ఉండదన్నారు. మొదటి పంటలో రైతుకు లాభం జరగడమే లక్ష్యంగా సర్కార్‌ పని చేస్తోందన్నారు. ఇది రైతులపై బలవంతంగా రుద్దడం కాదని స్పష్టం చేశారు.

కొత్త వంగడాలు వచ్చాయి..
కందిలో కొత్త వంగడాలు వచ్చాయని.. ఆరు నెలలకే పంట కాలం పూర్తయి దిగుబడి పెరుగుతుందన్నారు. ఆ తరువాత రెండో పంటగా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చన్నారు. సిద్దిపేట రిజర్వాయర్ల ఖిల్లా అని.. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఏడాది కాలం జలకళను సంతరించుకుంటాయన్నారు.  తెలంగాణలో ఎరువులు, విత్తనాలు, నీళ్లకు కొరత లేదన్నారు. గోదావరి జలాలపై ఆధారపడి పంటల సాగు చేస్తామన్నారు.

పత్తికి డిమాండ్‌ పెరిగింది..
కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మాస్క్ ల తయారీకి భారీ డిమాండ్‌ పెరిగిందని, పత్తికి డిమాండు ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 6.3 ఎంఎం పొడవు ఉన్న ధాన్యానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. సిద్ధిపేట జిల్లాలో 9,500 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో ఫామ్‌ ఆయిల్‌ సాగు ఎక్కువగా చేస్తారన్నారు.

వారి మాటలు రైతులు విశ్వసిస్తారా..?
జిల్లాలో సాగుకు భూసార పరీక్షలు, సర్వే చేయించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కోరామని తెలిపారు. కంది పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని విపక్షాల మాటలు రైతులు విశ్వసిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లేనని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు