...అను నేను !

17 May, 2014 03:51 IST|Sakshi
...అను నేను !
  •      మంత్రి పదవిపై సీనియర్ల ఆశలు
  •      చందూలాల్, మధుసూదనాచారికి అవకాశం
  •      రేసులో రాజయ్య, వినయ్, కొండా
  •      తొలి సర్కారులో చోటుపై టీఆర్‌ఎస్‌లో చర్చలు
  •  సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణలో తొలి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితిదే అని తేలిపోయింది. ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేరును శనివారం ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే జూన్ 2న నూతన ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో శనివారం జరిగే టీఆర్‌ఎస్ సమావేశానికి జిల్లాలోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వీరందరూ సమావేశానికి వెళ్తున్నా... మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికివారు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

    టీఆర్‌ఎస్ జిల్లాలో ఎనిమిది సీట్లు గెలిచింది. ఎక్కువ సంఖ్యలోనే గెలిచినా... టీఆర్‌ఎస్‌కు ఆశించిన మేర సీట్లు రాలేదు. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న జిల్లాలో టీడీపీ రెండు సీట్లు గెలవడం, పాలకుర్తిలో టీఆర్‌ఎస్ మూడో స్థానంలో నిలవడం గులాబీ పార్టీకి మింగుడుపడడంలేదు. ఆశించిన దాని కన్నా... రెండు సీట్లు తక్కువ వచ్చాయని భావిస్తున్న టీఆర్‌ఎస్ అధినాయకత్వం మంత్రి పదవుల కోటాలో జిల్లాకు ఎన్ని కేటాయిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి గరిష్టంగా 15 నుంచి 18 మందితో మంత్రివర్గం ఉండనుంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు పది జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించడంతోపాటు సామాజిక సమీకరణల్లో జిల్లాకు గరిష్టంగా రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ రెండు పదవులు ఎవరికి ఇస్తారనే అంశం తాజాగా ఆసక్తికరంగా మారింది.
     
    టీఆర్‌ఎస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ కావడంతో ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలు మంత్రి పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అజ్మీరా చందూలాల్ ములుగులో గెలిచారు. లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. గిరిజన నేతల్లో సీనియర్ కావడం, కేసీఆర్‌తో సాన్నిహిత్యంతో చందూలాల్‌కు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

    గిరిజనులు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్లు లేకపోవడం, ఖమ్మంలో ఈ వర్గం వారు గెలకపోవడం ఆయనకు అనుకూలంగా ఉండనుంది. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే మరో సీనియర్ నేత సిరికొండ మధుసూదనాచారి సైతం మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి కీలక నేతగా ఉన్న ఆయనకు సామాజిక సమీకరణలు అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది.

    అంతేకాదు... మధుసూదనాచారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉంటారని భూపాలపల్లి ఎన్నికల సభలో కేసీఆర్ ప్రకటించడం గమనార్హం. టీఆర్‌ఎస్‌లో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యతోపాటు మాజీ మంత్రి కొండా సురేఖ పేరు మంత్రి పదవి పరిశీలనలో ఉంటుందని టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది.
     

మరిన్ని వార్తలు