కొందరికి లాభం..కొందరికి నష్టం

9 Jun, 2020 02:24 IST|Sakshi

విద్యుత్‌ బిల్లులపై మంత్రి జగదీశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: స్వల్ప తేడాతో శ్లాబులు మారిపోయి చాలామంది వినియోగదారులకు భారీగా విద్యుత్‌ బిల్లులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎన్న డూ లేని విధంగా జూన్‌ నెలలో విద్యుత్‌ బిల్లులు భారీగా పెరిగిపోయాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో మంత్రి ఈ అంశం పై వివరణ ఇచ్చారు. మార్చి 23 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో ఏప్రిల్, మే నెలల్లో మీటర్‌ రీడింగ్‌ తీయడం సాధ్యం కాలేదని, దీంతో గత మూడు నెలల విద్యుత్‌ వినియోగానికి సంబంధించిన మీటర్‌ రీడింగ్‌ను ఈ నెలలో ఒకేసారి తీసి సగటున ఒక్కో నెల వినియోగాన్ని అంచనా వేసి బిల్లులు జారీ చేశామని తెలిపారు.

సోమవారం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, స్వల్పంగా కొన్ని పాయింట్ల తేడాతో అనేకమంది వినియోగదారులకు సంబంధించిన శ్లాబులు మారిపోయింది వాస్తవమే అని అంగీకరించారు. దీంతో కొంత మంది వినియోగదారులు లాభపడ్డారని, కొందరు నష్టపోయారని అన్నారు. వేసవిలో విద్యుత్‌ను ఎక్కువగా వాడడం వల్లే చాలా మందికి బిల్లులు అధికంగా వచ్చాయన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌మిశ్రా, ఎమ్మెల్యేలు సైతం తమకు బిల్లులు ఎక్కువ వచ్చాయంటూ ఫిర్యాదు చేశారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఏవైనా సాంకేతిక లోపాల వల్ల ఎవరికైనా అధికంగా బిల్లులు వస్తే వాటిని సరిదిద్దుతామన్నారు. గత మూడు నెలలకు సంబంధించిన బిల్లుల బకాయిలను వచ్చే మూడు నెలలపాటు వాయిదాల్లో 1.5 శాతం వడ్డీతో చెల్లించేందుకు అనుమతిస్తామని మంత్రి ప్రకటించారు.

మరిన్ని వార్తలు