మరింత కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు..

16 Apr, 2020 20:56 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: సూర్యాపేటలో కరోనా  పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి జగదీష్‌రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డితో పాటు మున్సిపల్‌, రెవెన్యూ, పోలీస్‌, వైద్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే.. ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యావసర సరుకులను నేరుగా ఇంటి వద్దకే అందించాలని మంత్రి ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో మంత్రి చర్చించారు. (సూర్యాపేటలో కరోనా కలకలం)

కరోనా పాజిటివ్‌ సోకిన వారిని తక్షణమే క్వారంటైన్‌కు తరలించాలని అధికారులను మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలన్నారు. లాక్‌డౌన్‌ అమలు మరింత కట్టుదిట్టం కానున్న నేపథ్యంలో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ రూపొందించిన యాప్‌ ద్వారా సరుకులు, కూరగాయలు పొందాలని ప్రజలకు ఆయన సూచించారు. ప్రజల సహకారం ఉంటే కరోనా వైరస్‌ అదుపులోకి వస్తుందని.. ఎవరైనా కరోనా పాజిటివ్‌ వ్యక్తులతో కాంటాక్ట్‌ అయినవారు ఉంటే స్వచ్ఛందంగా అధికారులను సంప్రదించాలని మంత్రి జగదీష్‌రెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు