విద్యుత్‌ డిమాండున్నా సరఫరాకు సిద్ధం

3 Mar, 2020 02:51 IST|Sakshi

ఎస్సారెస్పీ ప్రాజెక్టు అధికారులతో మంత్రి జగదీశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం 15 వేల మెగావాట్లకు చేరినా, సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ, గృహావసరాలకు కనెక్షన్లు పెరగడంతో వినియోగం పెరిగిందని వెల్లడించారు. కొత్తగా 40 లక్షల కనెక్షన్లు ఇవ్వడంతో విద్యుత్‌ డిమాండ్‌ రెండు రెట్లు పెరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు అదనంగా విద్యుత్‌ వాడకం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుగానే హెచ్చరించారని, అందుకు అనుగుణంగానే విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు.

విద్యుత్‌ చార్జీల పెంపుపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. సోమవారం ఆయన ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల ద్వారా నీటి పంపిణీ, కాల్వలకు అవసరమైన మరమ్మతులపై ఇరిగేషన్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు సూర్యాపేటకు వస్తాయా? అంటూ ప్రతిపక్ష నేతలు అవహేళన చేశారని, వారికి నీళ్లు తెచ్చి సమాధానమిచ్చామన్నారు. కాగా, ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డిండి ప్రా జెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, త్వరలోనే దీనిపై సీఎం సమీక్షిస్తారని తె లిపారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులకు సైతం అడ్వాన్సులు చెల్లించామని, సాంకేతిక ఇబ్బందుల వల్ల పనులకు ఆటంకం కలిగినా వాటినీ పరిష్కరిస్తామన్నారు.

మరిన్ని వార్తలు