వేల రూపాయల ఫీజులు కట్టలేని పేదలకు

15 Jun, 2019 12:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి ఉచిత విద్య అందించ సంకల్పించారని, అందుకే మహాత్మా జ్యోతిరావ్‌ పూలే బీసీ గురుకులాలు ప్రారంభం కాబోతున్నాయని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. వేల రూపాలయల ఫీజులు కట్టలేని పేదలకు ఈ పాఠశాలలు నిర్మించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 17న 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. మొత్తం 119 గురుకుల పాఠశాలలతో కలుపుకుని మొత్తం 162 గురుకుల పాఠశాలలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో గురుకుల పాఠశాల ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు అన్నీ ప్రజల ముందుకు వస్తున్నాయన్నారు.

తెలంగాణ ఏర్పడ్డ నాటికి 19 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు మొత్తం162 పాఠశాలలు ప్రారంభం అయ్యాయన్నారు. ఇంగ్లీష్ విద్య, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యార్థి భవిష్యత్తు ప్రగతే లక్ష్యంగా తెలంగాణ ముందుకెళ్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులకు వరంగా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి వీటిని ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. గురుకులాల్లో అడ్మిషన్ కోసం పోటీ పడుతున్నారని, గతంలో సీటు ఇస్తామన్నా వచ్చే వారు కాదన్నారు. సీట్ల పెంపుపైన సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు