వ్యవసాయం పండుగయ్యే వరకూ ‘రైతుబంధు’

15 May, 2018 01:24 IST|Sakshi

మంత్రి కేటీఆర్‌ 

రైతుబంధు గురించి విని రాజ్‌నాథ్‌సింగ్‌ ఆశ్చర్యపోయారు 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: వ్యవసాయాన్ని పండుగలా చేసి రైతును రాజులా మార్చే దాకా రాష్ట్రంలో రైతుబంధు పథకం కొనసాగుతుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు రైతులను రాబందుల మాదిరిగా పీక్కుతింటే.. సీఎం కేసీఆర్‌ రైతులకు బంధువుగా మారారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండల కేంద్రంలో సోమవారం ఆయన రైతుబంధు పథకం కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా రైతుల్లో చైతన్యం కల్పించడం కోసం రైతుబంధుపై ప్రచారం కల్పించాం. ఏ రాష్ట్రంలోనైనా రైతు రైతే కాబట్టి ఆయా ప్రభుత్వాలను నిలదీయాలి. దేశంలో 20 రాష్ట్రాల్లో బీజేపీ, రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నాయి. ఎక్కడ రైతులు తమపై తిరగబడతారోనని వారు భయపడుతున్నట్టుంది. అందుకే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకంపై దేశంలోని రైతుసంఘాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి, ఆఖరికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సైతం రైతుబంధు పథకం వివరాలు విని ఆశ్చర్యపోయారు’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

కేంద్రం, ఆర్బీఐ అడ్డుపడ్డాయి.. 
రైతులను రుణవిముక్తి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని కేటీఆర్‌ వెల్లడించారు. ఎన్నికలప్పుడు ప్రకటించిన రూ.లక్ష వరకు రుణమాఫీ పథకాన్ని ఒకేసారి అమలు చేయాలని ఎంతో కృషి చేశామని, దురదృష్టం కొద్ది కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు అడ్డుపడ్డాయని పేర్కొన్నారు. రైతుబంధు పథకాన్ని చూసి ఓర్వలేక భూ యజమానులు, కౌలు రైతులు, ప్రభుత్వానికి మధ్య చిచ్చుపెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. జూన్‌ 2నుంచి ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమాను ప్రభుత్వమే చేయించి, ప్రీమియం చెల్లిస్తుందని ప్రకటించారు.

మరిన్ని వార్తలు