యువ ఆవిష్కర్తకు కేటీఆర్‌ అభినందన

10 Nov, 2019 02:58 IST|Sakshi

వరి కలుపు తీసే యంత్రాన్ని కనుగొన్న అశోక్‌

సాక్షి, హైదరాబాద్‌: తక్కువ ఖర్చుతో వరి కలుపు తీసే పోర్టబుల్‌ యంత్రాన్ని కనిపెట్టిన యువ ఆవిష్కర్త అశోక్‌ను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రశంసించారు. వ్యవసాయ రంగంలో ఇలాంటి ఆవిష్కరణలు మరిన్ని రావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వపరంగా అశోక్‌కు అవసరమైన సహకారాన్ని అందించాలని ఆదేశించారు. రాష్ట్ర చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ ఫణీంద్ర సామతో కలిసి అశోక్‌ శనివారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. సూర్యాపేట జిల్లాకు చెందిన 17 ఏళ్ల అశోక్‌ ప్రస్తుతం దేవరకొండ ఒకేషనల్‌ కాలేజీలో అగ్రికల్చర్‌ కోర్సు చదువుతున్నాడు. రైతుల కోసం వరిలో కలుపు మొక్కలను తీసే యంత్రాన్ని తక్కువ ఖర్చుతో తయారు చేశాడు.

ఈ ఆవిష్కరణకు కోల్‌కతాలోని విజ్ఞాన భారతి (విభ) సహకారంతో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌ 2019’లో వ్యవసాయ రంగం కేటగిరీలో మొదటి బహుమతి లభించింది. గతంలో వినికిడి లోపంతో బాధపడే వారికి ఉపయోగపడేలా నిరీ్ణత సమయంలో వాసన విడుదల చేసే అలారం యంత్రం, చిన్న రైతుల కోసం బహుళార్థ సాధక హ్యాండ్‌ టూల్‌ తదితరాలను అశోక్‌ రూపొందించాడు. తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్, పల్లె సృజన ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదర్శనల్లో తన ఆవిష్కరణలను అశోక్‌కు ప్రస్తుతం కలుపు యంత్రానికి సంబంధించి 17కు పైగా తయారీ ఆర్డర్లు వచ్చాయి. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణల ద్వారా రైతులు, వ్యవసాయ రంగం అభివృద్ధికి తోడ్పాటునందించాలని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు.

దక్షిణాఫ్రికాకు రావాలని కేటీఆర్‌కు ఆహా్వనం
దక్షిణాఫ్రికా పర్యటనకు రావాల్సిందిగా కేటీఆర్‌ను ఆ దేశ టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆహ్వానించారు. శనివారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిసిన నాగరాజు.. ఏడాది కాలంలో టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా విభాగం ద్వారా చేపట్టిన సామాజిక కార్యక్రమాలు, సేవలను కేటీఆర్‌కు వివరించారు. సౌతాఫ్రికా విభాగం చేపట్టిన పనులతో ముద్రించిన మేగజైన్‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు