మీకు చెప్పినా వేస్ట్‌.. : మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

13 Jun, 2018 10:12 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం 

వర్షాకాలం పనులపై కేటీఆర్‌ సమీక్ష 

పూడికతీత, ఆక్రమణల తొలగింపు పూర్తి కాకపోవడంపై మండిపాటు 

పనుల్లో మరింత వేగం పెరగాలని ఆదేశం 

జీహెచ్‌ఎంసీ జోన్లు 10కి, సర్కిళ్లు 50కి పెంపు 

అభివృద్ధి పనుల భూసేకరణకు ప్రత్యేక విభాగం

సాక్షి, హైదరాబాద్‌: ‘నగరంలో వర్షాలు ప్రారంభమైనా పూడికతీత పనుల్లో వేగం మాత్రం పెరగలేదు. కార్యాచరణ ప్రణాళిక మేరకు పనులు పూర్తి కావడంలేదు. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించలేదు. శిథిల భవనాల కూల్చివేతల్లో జాప్యం కొనసాగుతోంది. రహదారులు మరమ్మతు పనులు పూర్తి కాలేదు. మీరేం చేస్తున్నారు’ అంటూ అధికారులపై మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రహదారుల తవ్వకాలు, నాలాల్లో పూడికతీత, సమస్యాత్మక బాటిల్‌నెక్స్, వాటర్‌ లాగింగ్‌ పాయింట్లు, వర్షాకాలం సమస్యలపై సంసిద్ధత తదితర పనులపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలో చేపట్టిన పనుల్లో బాగా వేగం పెరగాలని, సత్వరం పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. అందుకు అధికారులు బదులిస్తూ.. పూడికతీత ఏడాది పొడవునా చేస్తున్నామని, గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ పనే జరిగిందని చెప్పారు. దీనికి ‘నాక్కావాల్సింది అది కాదు.. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. పనులు స్లోగా నడుస్తున్నాయి. మాటల్లో కాకుండా చేతల్లో పనులు కనిపించాలి’ అంటూ మందలించారు. వర్షాకాలంలోగా రోడ్ల పనులు పూర్తి చేయాలంటే.. తాను ఊహించినట్టుగా పనులు జరగలేదన్నారు. ‘మీకెన్ని సార్లు చెప్పినా వేస్ట్‌’ అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నాలాలపై ఆక్రమణలు, శిథిల భవనాల తొలగింపులో అలసత్వం వద్దని, వీటికి ఎవరు అడ్డుపడ్డా వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా స్పష్టం చేశారు.

ఇందుకుగాను టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపులో టౌన్‌ ప్లానింగ్, విజిలెన్స్‌ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అక్రమ నిర్మాణాలను ఆరంభంలోనే అడ్డుకోవాలని, లేని పక్షంలో వాటిని తొలగించడం తీవ్ర సమస్యగా మారుతుందని హెచ్చరించారు. ఇప్పటికే గుర్తించిన ముంపు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడకుండా చేపట్టిన పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పనులు సత్వరం పూర్తయ్యేందుకు సర్కిల్, జోనల్, అడిషనల్‌ కమిషనర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. జోనల్‌ కమిషనర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.  విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను సహించబోమని మంత్రి హెచ్చరించారు. మంత్రి, మేయర్, కమిషనర్, చీఫ్‌ ఇంజినీర్లు, అడిషనర్లు కమిషర్ల వల్లనే సమస్యలన్నీ పరిష్కారం కావని, క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి సీనియర్‌ అధికారుల వరకు అందరి సమన్వయంతోనే వీటిని అధిగమించవచ్చన్నారు. లక్ష్యానికి అనుగుణంగా జీహెచ్‌ఎంసీ రోడ్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో అనుమతులివ్వాల్సిందిగా ట్రాఫిక్‌ అధికారులకు సూచించారు.  

జోన్లు 10కి, సర్కిళ్లు 50కి పెంపు.. 
అభివృద్ధి పనులు వేగవంతంగా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిమతమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిపాలనను మరింత వికేంద్రీకరించడం ద్వారా నగర ప్రజలకు మెరుగైన పౌరసేవలు కల్పించవచ్చునని సీఎం భావిస్తున్నారన్నారు. అందుకనుగుణంగా ప్రస్తుతం 30కి పెరిగిన సర్కిళ్లను 50కి, ఆరు జోన్లను 10కి పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు చెప్పారు. ఒక్కో సర్కిల్‌లో కేవలం మూడు వార్డులు మాత్రమే ఉండేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. 

ప్లాస్టిక్‌ వినియోగంపై అసంతృప్తి 
జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల వినియోగాన్ని చూసి మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022 నాటికి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని ఇటీవలే ప్రతిజ్ఞ చేసినా జీహెచ్‌ఎంసీలోనే వాడి పడేసిన ఖాళీ ప్లాస్టిక్‌ బాటిల్స్‌ కనిపించాయన్నారు. ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధాన్ని కచ్చితంగా పాటించాలని, జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్నిమున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు స్పష్టమైన ఆదేశాలివ్వాల్సిందిగా మున్సిపల్‌ పరిపాలన ప్రిన్సిపల్‌ సెక్రటరీకి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలన్నారు.  

భూసేకరణకు ప్రత్యేక విభాగం.. 
నగరంలో పెద్ద ఎత్తున ఎస్సార్‌డీపీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, రోడ్ల విస్తరణ పనులు చేపట్టినందున వీటికి అవసరమైన భూసేకరణకు జీహెచ్‌ఎంసీలోనే ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఇతర పనుల ఒత్తిడి వల్ల జీహెచ్‌ఎంసీకి అవసరమైన భూసేకరణలో తగిన సమయం కేటాయించలేక పోతున్నందున ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో మేయర్‌ రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, మున్సిపల్‌ పరిపాలన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి, పబ్లిక్‌హెల్త్‌ ఈఎన్‌సీ ధన్‌సింగ్, జలమండలి, హెచ్‌ఆర్‌డీసీఎల్, ట్రాఫిక్, పబ్లిక్‌హెల్త్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు