‘నేరెళ్ల’ తర్వాత కూడా మారకపోతే ఎలా?

16 Aug, 2017 02:40 IST|Sakshi
‘నేరెళ్ల’ తర్వాత కూడా మారకపోతే ఎలా?
తంగళ్లపల్లి ఎస్‌ఐపై మంత్రి ఆగ్రహం 
- ఎవర్ని బద్నాం చేద్దామని ప్రశ్న 
 
సిరిసిల్ల రూరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ఎస్‌ఐ వెంకటకృష్ణపై మంత్రి కేటీఆర్‌ మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జిల్లెల్ల గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడి వివాహ వేడుకలకు హాజరయ్యారు. బందోబస్తు కోసం తంగళ్లపల్లి ఎస్‌ఐ వెంకటకృష్ణ అక్కడికి వచ్చా రు. అయితే.. ఎస్‌ఐ వెంకటకృష్ణ పలువురిపై చెయ్యి చేసుకున్న ఘటనలు, వాహన తనిఖీల్లో దురుసుగా ప్రవర్తించడం, రూ.వేలల్లో జరిమా నాలు వేయడం వంటి విషయాలను అప్పటికే కొందరు వాట్సాప్‌ ద్వారా మంత్రికి చేరవేశారు. వేడుకలో ఉన్న యువజన నాయకులు కూడా సదరు విషయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి ఎస్‌ఐని పిలిచి ‘ఏమయ్యా.. వెంకటకృష్ణ.. నీకు బాగా సర్వీస్‌ ఉంది.. గిప్పుడే గిట్ల జేస్తే ఎట్ల..? సిరిసిల్ల ప్రాంత ప్రజలు పేదవాళ్లు.. రూ.లక్షలు, కోట్లు సంపాదించేటోళ్లు కాదు. జర దూకుడు తగ్గియ్‌. నీ మీద బాగా ఫిర్యాదులు వస్తున్నయ్‌.. ఇప్పటికే నేరెళ్ల ఘటన చాలా పెద్దదైంది.. లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ ఇక్కడకు వచ్చి బాధితులను పరామర్శించే వరకూ చేరింది.

అయినా.. నీ ప్రవర్తన మారదా.. ఎవరిని బద్నాం చేద్దామనుకుంటున్నరు’ అంటూ తీవ్ర స్థాయిలో మందలించారు. టార్గెట్ల కోసం రూ.వేలల్లో జరిమానా విధించడం సరికాదని, ప్రజలతో మర్యాదగా నడుచు కోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వివాహ వేడుకలో గంటపాటు సరదాగా ఉన్న మంత్రి కేటీఆర్‌.. తిరుగుపయనంలో ఎస్సైని మందలించడం కలకలం రేపింది. ఈ విష యాన్ని స్థానిక యవకులు వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. కాగా,ఉదయం జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లా పోలీసు అధికారులకు మంత్రి అవార్డులు ప్రదానం చేశారు. అందులో ఎస్‌ఐ వెంకట కృష్ణకూ అవార్డు ఇవ్వడం గమనార్హం.
మరిన్ని వార్తలు