నేనూ కరీంనగర్‌లోనే చదువుకున్నా: కేటీఆర్‌

21 Jul, 2020 14:59 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో టాలెంట్ కేవలం హైదరాబాద్, బెంగుళూర్, ఢిల్లీ లాంటి నగరాల విద్యార్థులకే సొంతం కాదని ఐటీ శాక మంత్రి కేటీఆర్‌ అన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో, నగరాల్లోని నైపుణ్యవంతులైన యువత ఇతర నగరాలకు వలస పోవాల్సి వస్తోందని, ఐటీ నిర్వచనం మార్చాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు.. ఇంటెలిజెన్స్ టెక్నాలజీగా మార్చాలని చెప్పారు. కరీంనగర్‌లో మంగళవారం ఆయన ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘నేను కరీంనగర్ లోనే చదువుకున్నా.. అప్పటికీ, ఇప్పటికీ ఈ నగరం ఎంతో అభివృద్ధి సాధించింది. ఐటీ టవర్ ప్రారంభం రోజునే 432 మంది యువతకు ఉద్యోగాలు రావడం సంతోషం. తెలంగాణ వచ్చిన కొత్తలో 56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉండేవి. ఐటీ రంగం పురోగతి ఆగకూడదన్న ఆలోచనతో రెట్టింపు స్పీడ్ కావాలన్న లక్ష్యం పెట్టుకున్నాం. అనుకున్నట్లుగానే ఇప్పుడు లక్షా 28 వేల కోట్లకు తెలంగాణ ఐటీ ఎగుమతులు చేరుకున్నాయి. ప్రభుత్వం కేవలం ఐటీ రంగానికి ప్రేరణగా ఉంటుంది... చేసేదంతా ప్రయివేటు రంగమే ’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.
అద్దెలు లేకండా చూస్తాం
ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో విజయాలు సాధించవచ్చని కేటీఆర్‌ అన్నారు. తెలివైన యువతీ, యువకులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఎన్నో అద్భుత విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. స్థానిక యువతలో టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మనిషి జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించే ఐటీ సొల్యూషన్స్ రావాల్సి ఉందని ఆకాక్షించారు. కోవిడ్ సంక్షోభం కారణంగా ఐటీ టవర్‌లోని స్టార్టప్‌లకు జనవరి వరకు ఎలాంటి అద్దె లేకుండా చూస్తామని చెప్పారు. మరో ఐటీ టవర్ కూడా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కరీంనగర్ నుంచి వెళ్లి విదేశాల్లో ఐటీ సంస్థలు నడుపుతున్న ఎన్నారైలు కరీంనగర్ ఐటీ టవర్‌లో కూడా సంస్థలు స్థాపించాలని పిలుపునిచ్చారు. వరంగల్‌లో టెక్ మహీంద్రలాంటి సంస్థలు వచ్చాయని కేటీఆర్‌ గుర్తు చేశారు. కరీంనగర్‌లో ఐటీ రంగం మరింత వృద్ధి చెంది వేలాది మందికి ఉపాధి కల్పించే కేంద్రంగా మారాలని అన్నారు.

మరిన్ని వార్తలు