మనమే భేష్‌

18 Oct, 2019 02:27 IST|Sakshi

భవన నిర్మాణ అనుమతులపై మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: భవన నిర్మాణ అనుమతుల్లో మన విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. అనుమతుల జారీలో పారదర్శకత పాటిస్తున్నామని, ఆన్‌లైన్‌లో అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ సంఘాల ప్రతినిధులు గురువారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. బిల్డింగ్‌ పర్మిషన్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం గురించి అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి..దీన్ని మరింత సులభతరం చేసే దిశగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే ఉన్నతాధికారుల బృందం కసరత్తు మొదలుపెట్టిందని, బిల్డర్ల సంఘాల నుంచి ప్రతినిధులకు ఇందులో అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో భవన నిర్మాణ అనుమతులను పరిశీలించి.. అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి చొరవచూపాలని కోరారు. ఇప్పటికే పురపాలక సంఘాల్లో ఈ–ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తున్నామని, దీంతో అనుమతులు ఏ దశలో ఉన్నాయో తెలుస్తాయని, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసే అవకాశం ఉండదని చెప్పారు.

రియల్టీలో జోష్‌.. 
స్థిరాస్తి రంగం వృద్ధిలో దేశంలోనే హైదరాబాద్‌ టాప్‌లో ఉందని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన సరళీకరణ విధానాలతో ఇది సాధ్యపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ డ్రాఫ్ట్‌ టౌన్‌ షిప్‌ పాలసీని బిల్డర్‌ సంఘాలకు అందిస్తామని, ముసాయిదాపై సలహాలు, సూచనలివ్వాలని సూచించారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కార్యక్రమాల్లో భాగంగా జీహెచ్‌ఎంసీతో కలిసి పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో క్రెడాయ్‌ తెలంగాణ, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్, ఇతర సంఘాల ప్రతినిధులు మంత్రిని కలిశారు.

మరిన్ని వార్తలు