ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా సిటీ

10 Oct, 2017 14:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాస్యూటికల్ సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఫార్మాసిటీపై సమగ్ర అధ్యయనం చేశామన్న కేటీఆర్.. దానికోసం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరుగుతుందని తెలిపారు. హెచ్‌ఐసీసీలో ఫార్మా సిటీపై మంత్రి కేటీఆర్ మంగళవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో పూర్తి స్థాయిలో మెడిసిన్స్ ఉత్పత్తిలో మనం వెనుకబడి ఉన్నామని తెలిపారు. చైనా, యూరప్, అమెరికా నుంచి మందులు దిగుమతి అవుతున్నాయన్నారు. 84 శాతం మందుల ముడి సరుకు దిగుమతులపైనే మనం ఆధారపడి ఉన్నామని పేర్కొన్నారు. చైనా నుంచి 66 శాతం ముడి సరుకు దిగుమతి చేసుకుంటున్నాం. మెడిసిన్ దిగుమతులను తగ్గించాలన్నారు. డొమెస్టిక్ మెడిసిన్ తయారు అయినప్పుడే ధరలు తగ్గుతాయన్నారు. దేశీయంగా ఔషధాల తయారీని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి లభిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. 

కాలుష్యం ముప్పు ఉండదు
ఆరు, ఏడు ప్రాంతాల్లో పారిశ్రామికవాడలు ఉండటం వల్ల డబ్బు అదనంగా ఖర్చు అవడంతో పాటు కాలుష్యం కూడా పెరిగిందన్నారు. ఫార్మా కంపెనీలన్నీ ఒకే చోట ఉంటే ఈ సమస్య ఉండదన్నారు. ఫార్మా సిటీ ఏర్పాటుతో కాలుష్యం ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. ఫార్మా సిటీ పరిసరాల్లో ఉండే ప్రజలకు కాలుష్యం ముప్పు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. అత్యాధునిక వసతులతో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

దశల వారీగా ఫార్మా సిటీ ప్రాజెక్టు
గతంలో వివిధ ప్రాంతాల్లో ఫార్మా సిటీలు ఉండటం వల్ల ఔషధాల ఉత్పత్తి వ్యయం పెరిగిందని తెలిపారు కేటీఆర్. ఫలితంగా తక్కువ మోతాదులోనే ఔషధాల ఉత్పత్తి జరిగిందని చెప్పారు. అన్ని ఒకే చోట ఉండేలా ఫార్మా ఇండస్ట్రీయల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఏక కాలంలో 19333 ఎకరాల ఫార్మాసిటీ ప్రాజెక్టును చేపట్టడం సాధ్యం కాదన్నారు మంత్రి. దశలవారీగా ఈ ఫార్మా సిటీ ప్రాజెక్టును చేపడుతామని ప్రకటించారు. ప్రపంచంలోనే ఫార్మాస్యూటికల్ లార్జెస్ట్ ఇండస్ట్రీయల్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అతి తక్కువ వ్యయంతోనే హైదరాబాద్ ఫార్మాసిటీలో అన్ని మెడిసిన్స్ లభించేలా ప్రణాళిక చేశామని పేర్కొన్నారు. 

ఫార్మా సిటీ ఏర్పాటుతో 4 లక్షల మందికి ఉపాధి
ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. వారికి ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తుందని చెప్పారు. ఫార్మాసిటీలో పని చేసే వాళ్లంతా అక్కడే నివాసం ఉండబోతున్నారని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు