సంక్షోభమే అవకాశంగా..

25 Jun, 2020 01:24 IST|Sakshi
పురపాలక శాఖ వార్షిక నివేదిక విడుదల చేస్తున్న కేటీఆర్‌. చిత్రంలో తలసాని, ఎర్రబెల్లి తదితరులు 

లాక్‌డౌన్‌ కాలంలో రూ.2 వేల కోట్లతో పనులు పూర్తి 

లక్షా 25 వేల మందికి ఉచిత భోజనం అందించాం

పురపాలక శాఖ 24 గంటలు నిరంతరం పనిచేసింది

పురపాలక శాఖ వార్షిక నివేదిక ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సంక్షోభాన్ని అవకాశంగా వాడుకుని పురపాలక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నగరంతో పాటు ఇతర పురపాలికల్లో రూ.2 వేల కోట్ల విలువైన రోడ్లు, ఫ్లై ఓవర్లు వంటి పనులను గడిచిన 60 రోజుల లాక్‌డౌన్‌ కాలంలో పూర్తి చేశామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. కరోనా మహమ్మారి కట్టడి కోసం లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి పురపాలక శాఖ 24 గంటలపాటు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ప్రజలకు నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలను అందించిందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో లక్షా 25 వేల మందికి ఉచిత భోజనాన్ని అందించిందన్నారు. వలస కార్మికులను సొంత గ్రామాలకు పంపేందుకు ఇతర శాఖలను సమన్వయం చేసుకుని పురపాలక శాఖ పని చేసిందన్నారు.

మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి బుధవారం ఆయన ప్రగతి భవన్‌లో పురపాలక శాఖకు సంబంధించిన వార్షిక పురోగతి నివేదిక 2019–20ను విడుదల చేశారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను చేపట్టామని, ఈ క్రమంలో కొత్త మున్సిపల్‌ చట్టం తీసుకొచ్చామని కేటీఆర్‌ పేర్కొన్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలు గల లివబుల్, లవబుల్‌ సిటీల రూపకల్పనకు దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. పట్టణాల్లో ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాల కల్పనపై ప్రస్తుతం దృష్టి పెట్టామన్నారు.  

నివేదికలోని ముఖ్యాంశాలు... 

  • కొత్త మున్సిపల్‌ చట్టంతో పట్టణాల్లో నూతన శకం ప్రారంభమైంది. స్వీయ ధ్రువీకరణతో ఆన్‌లైన్‌లో ఆస్తి పన్నుల మదింపు, ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు వంటి విప్లవాత్మక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ప్రతి పురపాలిక బడ్జెట్‌లో పది శాతం నిధులను హరిత బడ్జెట్‌గా ఉంచాలని, ప్రతి వార్డులో నాలుగు వార్డు స్థాయి కమిటీలను 15 మందితో ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశించింది. 
  • పెరుగుతున్న పట్టణ జనాభాకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్రంలో కొత్తగా 61 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు. దీంతో మొత్తం మున్సిపాలిటీల సంఖ్య 139కి పెరిగింది. 
  • పురపాలికల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందించింది. టీయూఎఫ్‌ఐడీసీ ఆధ్వర్యంలో 110 పురపాలికల్లో రూ. 2వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నిధులతో అన్ని పురపాలికల్లో రోడ్ల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చారు.  
  • భవన నిర్మాణ అనుమతులను మరింత సరళం చేసేందుకు టీఎస్‌–బీపాస్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన తర్వాత పూర్తి స్థాయిలో అమల్లోకి తేనున్నారు.  
  • రోడ్ల విస్తరణలో టీడీఆర్‌ పాలసీ కింద స్థలాలను సేకరించడం ద్వారా 2019– 20లో రూ.250 కోట్ల విలువైన టీడీఆర్‌ సర్టిఫికెట్ల విక్రయాలు చేశారు.  
  • ప్రపంచంలోనే పొడవైన పీపీపీ మెట్రో రైల్‌ ప్రాజెక్టు 69 కిలోమీటర్ల మేర పూర్తి అయింది.  
  • 123 బస్తీ దవాఖానాలతోపాటు కొత్తగా 45 దవాఖానాలను తెరిచారు. ఏడాదిలోగా మరో 350 బస్తీ దవాఖానాలను తెరుస్తారు.  
  • ళమిషన్‌ భగీరథతో పట్టణాల్లో తాగునీటి సరఫరా సమస్య తీరిపోయింది. 24 పురపాలికలు, 18 గ్రామపంచాయతీలను అనుసంధానం చేస్తూ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ లోపల రూ.725 కోట్లతో జలమండలి నీటి సరఫరా ప్రాజెక్టును పూర్తి చేసింది. హైదరాబాద్‌కు తాగునీటి భరోసా కల్పించే 20 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.  
మరిన్ని వార్తలు