ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌: కేటీఆర్‌

2 May, 2020 15:47 IST|Sakshi

రోడ్ల నిర్మాణ పనులపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఆయన శనివారం బుద్ధభవన్‌ లో హైదరాబాద్ రోడ్డు డవలప్‌మెంట్‌ కార్పొరేషన్ కింద చేపట్టిన పనుల ప్రగతిపై సమీక్ష జరిపారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇది వర్కింగ్ సీజన్ అని.. ఒక నెల పాటు పనులు చేయవచ్చన్నారు. జూన్ నుండి వర్షాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణకు గుర్తింపు..
దేశంలో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. దేశంలో లాక్ డౌన్ ను చక్కగా వినియోగించుకున్న రాష్ట్రంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. మే నెలలో కొన్ని పనులను చేపడతామని.. అందుకనుగుణంగా పనులకు తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సూచించారు.
(లాక్‌డౌన్‌: సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై ఉత్కంఠ)

వారి పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలి...
వివిధ ప్యాకేజీల కింద చేపట్టిన లింక్ రోడ్ల లో అక్కడక్కడ అటంకంగా వున్న భూముల సేకరణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో నిర్వాసితులయ్యే  పేదలు, కూలీల పట్ల మానవీయకోణంలో వ్యవహరించాలన్నారు. అటువంటి నిర్వాసితులకు ప్రభుత్వపరంగా పునరావాసం కల్పించాలని చెప్పారు. జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్ రోడ్ల వెడల్పు 120 అడుగులు వుండాలన్నారు. భవిష్యత్తులో ఈ లింక్ రోడ్లు వలన ఆయా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఎస్ఆర్ డిపి, లింక్, సర్వీస్ రోడ్ల ను మరింత ప్రయోజనకరంగా పొడిగించేందుకు హెచ్ ఎండిఎ, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
(జోరందుకున్నఉపాధి పనులు) 

నిధులకు కొరత లేదు..
భవిష్యత్ అవసరాలు, పెరిగే ట్రాఫిక్ రద్దీని అంచనా వేసి పనులు చేపట్టాలని వివరించారు. హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ ను అప్డేట్ చేయనున్నట్లు ప్రకటించారు. అందుకనుగుణంగా రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేయాలని తెలిపారు. అలాగే నిర్మాణం లో వున్న  రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జి లతో పాటు, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కూడా  అవసరమైన భూ సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు, భూసేకరణకు నిధులు కొరత లేదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు