విచ్చలవిడి పరీక్షలతో భయాందోళన

8 Apr, 2020 02:33 IST|Sakshi
హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కరోనా ప్రత్యేక ఆస్పత్రి పనులను పరిశీలిస్తున్న మంత్రులు కేటీఆర్, ఈటల తదితరులు

అందుకే ప్రైవేటు సెంటర్లకు అనుమతి ఇవ్వడం లేదు

జాతీయ మీడియాతో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా పరీక్షల కోసం విచ్చల విడిగా అనుమతులు ఇస్తే ప్రైవేటు డయాగ్నొస్టిక్‌ సెంటర్లు ప్రజలను భయాందోళనకు గురి చేసే అవకాశముందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. అందుకే అనుమతులు ఇవ్వకుండా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలపై మంగళవారం కేటీఆర్‌ జాతీయ మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ కొనసాగింపే సరైన విధానమన్నారు. లాక్‌డౌన్‌లో పేదలు, వలస కార్మికుల సంక్షేమం విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. 

లాక్‌డౌన్‌ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం..
లాక్‌డౌన్‌ పరిస్థితులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని, ఆకలి చావులు ఉండకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. 3 దశల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అవసరమైన వైద్య సామగ్రిని సమకూర్చుకోవడంతో పాటు, 15 వేల పడకలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. 

ప్రత్యేక ఆస్పత్రి పనుల పరిశీలన..
హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ అథారిటీ కాంప్లెక్స్‌ను కరోనా ప్రత్యేక ఆస్పత్రిగా మార్చేందుకు జరుగుతున్న పనులను మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్‌  పరిశీలించారు. ఈనెల 15లోపు ఆస్పత్రిని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.  అనంతరం కేటీఆర్, ఈటల మొయినాబాద్‌ మండలంలోని భాస్కర మెడికల్‌ ఆస్పత్రిలో క్వారంటైన్‌ సెంటర్‌ను పరిశీలించారు.

మరిన్ని వార్తలు