పెట్టుబడులకు వస్త్ర పరిశ్రమ అనుకూలం

7 Jul, 2020 07:36 IST|Sakshi

టెక్స్‌టైల్‌ రంగంలో అనేక అవకాశాలు 

దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కు రాష్ట్రంలోనే.. 

తెలంగాణ పాలసీ దేశంలోనే అత్యుత్తమం 

స్మృతి ఇరానీతో కలిసి వెబినార్‌లో పాల్గొన్న కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వస్త్ర పరిశ్రమ రంగంలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎర్రతివాచీ పరుస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులకున్న మెరుగైన అవకాశాల గురించి పెట్టుబడిదారులకు వివరిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు పలు వివరాలను వెల్లడించారు. ఇన్వెస్ట్‌ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం జరిగిన టెక్స్‌టైల్‌ అపెరల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మీట్‌ వెబినార్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్టంలో వస్త్ర, దుస్తుల తయారీ రంగంలో పెట్టుబడులకున్న సానుకూలతలను వివరించారు. రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా, నాణ్యత విషయంలో ఇక్కడి పత్తి అంతర్జాతీయస్థాయి ప్రమాణాలకు దీటుగా ఉందని చెప్పారు. పెట్టుబడులతో వచ్చేవారికి అత్యంత అనుకూల పారిశ్రామిక విధానం రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, సులభతర వాణిజ్య విధానంలో దేశంలోనే తాము అగ్రభాగాన ఉన్నామని కేటీఆర్‌ గుర్తుచేశారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్, మిషన్‌ భగీరథ ద్వారా నిరాటంకంగా నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. (ఆ ఇంటి కరెంట్‌ బిల్లు రూ. 25,11,467)

పరిశ్రమల కోసం నైపుణ్యశిక్షణ 
పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ ఖర్చుతోనే నైపుణ్య శిక్షణ ఇస్తున్న విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపి దేశంలోనే అత్యుత్తమ టెక్స్‌టైల్‌ పాలసీని రూపొందించామన్నారు. టెక్స్‌టైల్‌ను ప్రాధాన్యతారంగం గా గుర్తించామని,ప్రోత్సాహకాల విష యంలో పెట్టుబడిదారులకు టైలర్‌మే డ్‌ పాలసీ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు సం దర్భంగా ఎదుర్కొన్న అనుభవాలను, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వెల్‌స్పాన్‌ సీఈవో దీపాలి గొయెంకా వివరించారు. కాగా, కేటీఆర్‌ ప్రసంగాన్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అభినందించారు. కోవిడ్‌ సంక్షోభాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుని.. గతంలో పీపీఈ కిట్లు తయారు చేయలేనిస్థితి నుంచి ప్రస్తుతం ప్రపంచలోనే అతి ఎక్కువ సంఖ్యలో కిట్లు తయారు చేస్తున్న రెండోదేశంగా భారతదేశం నిలిచిందని స్మృతి ఇరానీ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పాలసీలు, ఇతర అంశాలను ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వెబినార్‌లో వివరించారు. (సర్కారు, గవర్నర్‌..  ఓ కరోనా)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు