'రాత్రికి రాత్రే విశ్వనగరాలు కావు'

14 Nov, 2017 11:51 IST|Sakshi

నగరంలో మంచి నీటి కొరత లేదు

లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టబోతున్నాం

సిటీ రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మంచి నీటి కొరత లేకుండా చేశామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. నగరంలో మంచినీటి సమస్య లేదన్నారు. మంచినీటి సరఫరా విషయంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మెట్రో వాటర్ బోర్డు పనుల్లో జాప్యం లేదని తేల్చిచెప్పారు. జీహెచ్‌ఎంసీలో గత సంవత్సరంలోనే వెయ్యి కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ మీద భారం పడకుండా లక్ష ఇండ్లు కట్టబోతున్నామని తెలిపారు. లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లకు రూ. 8,650 కోట్లు కేటాయించామన్నారు. ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. రాత్రికి రాత్రే విశ్వనగరాలు తయారు కావు అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి.. అందుకనుగుణంగా కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు. సిటీలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించామని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు